దేవుడు ఆదేశించాడ‌ట‌!..త‌లైవా వ‌స్తున్నాడ‌ట‌!

Update: 2017-08-21 05:03 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు త‌మిళుల‌నే కాకుండా యావ‌త్తు దేశ ప్ర‌జ‌లకు పెద్ద ఎత్తున ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి - త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు... అక్క‌డి తాజా రాజ‌కీయాల‌ను మ‌రింత ఆసక్తిగా మార్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె పార్టీ నిట్ట నిలువునా మూడు ముక్క‌లు కాగా... ఇప్పుడు రెండు ముక్క‌లు క‌లిసిపోవ‌డానికి రంగం సిద్ధం కాగా... మ‌రో ముక్క‌ను ఏకంగా పార్టీ నుంచి పూర్తిగా బ‌హిష్క‌రించేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలో త‌మిళులంతా త‌లైవాగా పూజించే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయంగా తెరంగేట్రం ఖాయ‌మేన‌ని వార్త‌ల‌కు మ‌రింత‌గా బ‌లం చేకూరింద‌నే చెప్పాలి.

చాలా రోజుల నుంచి ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశం గురించి వార్త‌లు వ‌స్తున్నా... ఎప్ప‌టిక‌ప్పుడు ర‌జ‌నీ వెన‌క‌డుగు వేస్తూనే ఉన్నారు. అయితే స‌రైన స‌మ‌యం కోస‌మే ర‌జ‌నీ వేచి చూస్తున్నార‌ని, కాస్తంత ఆల‌స్య‌మైనా ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మేన‌ని నిన్న తిరుచ్చి వేదిక‌గా జ‌రిగిన ఓ స‌మావేశం కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. గాంధేయ మక్క‌ల్ ఇయ‌క్కం నేత త‌మిళ‌రువి మ‌ణియ‌న్ నిన్న తిరుచ్చిలో 'మ‌హానాడు' పేరిట జ‌రిగిన స‌భ‌కు ర‌జ‌నీ అభిమానులు పోటెత్తారు. ర‌జ‌నీ నుంచి ఆదేశాలు ఉన్న కార‌ణంగానే ఆయ‌న అభిమానులు మ‌ణియ‌న్ పిలుపున‌కు భారీ ఎత్తున స్పందించార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. తాను కూడా ఊహించ‌నంత మంది త‌లైవా అభిమానులు త‌న స‌భ‌కు రావ‌డంతో మ‌ణియ‌న్ కూడా విస్తుపోయార‌ట‌. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ అభిమాన సందోహం మ‌ధ్య మ‌ణియ‌న్ భావోద్వేగంతో కూడిన ప్ర‌సంగం చేశారు.

ర‌జ‌నీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం నూటికి నూరు పాళ్లు ఖాయ‌మేన‌ని తాను విశ్వ‌సిస్తున్నాన‌ని ప్ర‌సంగం మొద‌లెట్టిన మ‌ణియ‌న్‌... త‌లైవా రాజ‌కీయాల్లోకి రాకుండానే త‌మిళ‌నాడులో ఏకంగా 25 శాతం ఓటు బ్యాంకు ర‌జ‌నీ ద‌రి చేరింద‌ని చెప్పారు. అయితే ఎప్పుడైతే త‌లైవా రాజ‌కీయ రంగ ప్ర‌వేశాన్ని ప్ర‌క‌టిస్తారో... ఈ ఓటు బ్యాంకు ఒక్క‌సారిగా 45 శాతానికి పెర‌గ‌డం ఖాయ‌మేన‌ని మ‌ణియ‌న్ చెప్పుకొచ్చారు. 45 శాతం ఓటు బ్యాంకుతో వ‌చ్చీరాగానే ర‌జ‌నీ... రాష్ట్రానికి సీఎం కావ‌డం ఖాయ‌మేన‌ని కూడా ఆయ‌న చెప్పారు. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై తాను ర‌జ‌నీతో మాట్లాడాన‌ని చెప్పిన మ‌ణియ‌న్‌... ఆ సంద‌ర్భంగా ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌ని ర‌జ‌నీ త‌న‌తో అన్నార‌ని కూడా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఇక మ‌హానాడు స‌భ ఏర్పాట్ల విష‌యానికి వ‌స్తే... జాతిపిత మ‌హాత్మా గాంధీతో పాటు త‌మిళ‌నాడు మాజీ సీఎం కామ‌రాజ‌ర్ చిత్ర ప‌టాల‌తో పాటు భారీ ఎత్తున ర‌జ‌నీకాంత్ క‌టౌట్లు కూడా అక్క‌డ క‌నిపించాయ‌ట‌. ఈ స‌భ‌ను చూసిన త‌మిళ తంబీలు... ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మైపోయింద‌న్న కోణంలో సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!
Tags:    

Similar News