తెలంగాణ పోలీస్ కు రాజ్ నాథ్ ప్రశంసలు

Update: 2016-02-17 11:30 GMT
తెలంగాణ పోలీసులకు అనుకోని ప్రశంసలు దక్కాయి. ఒడిశా రాష్ట్రంలో ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసులను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఆయన తెలంగాణ డీజీపీకి ఫోన్‌ చేసి తన అభినందనలు తెలియజేశారు.  ఒడిశాలోని రావూర్‌ ఖిలా కురేచిలో ఉగ్రవాదుల ఇంటిపై తెలంగాణ పోలీసులు దాడులు చేసి నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారని రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంతోనే పోలీసు శాఖకు గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.

కాగా ఒడిశా, తెలంగాణ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కాండ్వా జైలు నుంచి తప్పించుకున్న నలుగురు సిమీ ఉగ్రవాదులను రావూర్‌ఖిలా కురేచిలో పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ఓ ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. మూడు గంటల పాటు ఉగ్రవాదులు-పోలీసుల మధ్య సాగిన కాల్పుల అనంతరం వీరిని అరెస్టు చేశారు. 2013లో కాండ్వా జైలు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా, గత ఏడాది ఇద్దరు ఉగ్రవాదులు ఎజాజ్‌ - అస్లామ్‌ లను నల్గొండలో హతమార్చారు. కాగా ఎన్‌ ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో ఉన్న నలుగురు ఉగ్రవాదులైన జాకీర్‌ - అంజాద్‌ - మహబూబ్‌ - సాలిక్‌ లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఐదు పిస్టోళ్లు - బుల్లెట్లు - ఇతర పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరు తప్పించుకోవడంతో పోలీసులు ఒక్కొక్కరిపై రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఇప్పుడు వారిని ఒడిశా, తెలంగాణ పోలీసులు కలిసికట్టుగా అరెస్టుచేయగలిగారు.

తరచూ ఉగ్రవాదుల జాడతో ఉలిక్కిపడే తెలంగాణలో పోలీసు శాఖకు కేంద్రం నుంచి గుర్తింపు లభించడంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తారని భావిస్తున్నారు.
Tags:    

Similar News