చంద్ర‌బాబు గుట్టు ర‌ట్టు చేసిన రాజ్‌ నాథ్‌!

Update: 2018-07-24 16:47 GMT
ఏపీకి హోదా విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఏమిట‌న్న‌ది ఇప్ప‌టికే చాలాసార్లు స్ప‌ష్ట‌మైన సంగ‌తి తెలిసిందే. హోదా ఊసెత్తితో జైల్లో వేస్తాన‌న్న చంద్ర‌బాబు...నేడు యూట‌ర్న్ తీసుకొన్న విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ కూడా మొన్న పార్ల‌మెంటులో ప్ర‌స్తావించారు. హోదాకు బ‌దులు ప్యాకేజీ ఇస్తామ‌న్న ప్ర‌క‌ట‌న‌కు చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ....ఢిల్లీ పెద్ద‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు. హోదా ఏమ‌న్నా సంజీవ‌నా...అంటూ ఆంధ్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశారు. ఊస‌ర‌వెల్లిలా ఇన్నిమాట‌లు మార్చిన చంద్ర‌బాబుపై ఏపీ ప్ర‌జ‌లు - విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవే విష‌యాల‌ను  కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ పార్ల‌మెంటు సాక్షిగా మ‌రోసారి ధృవీక‌రించారు.   ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు - సుజనా చౌదరి స్వాగతించ‌డ‌మే కాకుండా.....అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తున్నామని, చంద్ర‌బాబు కూడా దానికి అంగీకరించార‌ని అన్నారు. ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో రాజ్ నాథ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని - బిల్లులోని హామీల్లో 90 శాతం నెరవేర్చామని రాజ్ నాథ్ అన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. రైల్వే జోన్ పై ప్రతికూల‌ నివేదిక వచ్చినా...ఇచ్చిన మాట ప్ర‌కారం జోన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామ‌ని ఏపీ సర్కార్‌ కోరింద‌ని - ఇప్పటివరకూ రూ 6754 కోట్లు పోల‌వరానికి మంజూరు చేశామని అన్నారు. 7 ముంపు మండలాలను ఏపీలో కలిపామని - సాధ్య‌మైనంత త్వ‌ర‌లో పోల‌వరాన్ని పూర్తి చేస్తామ‌ని అన్నారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై కూడా రాజ్‌ నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చర్చలో తాము చెబుతున్న అంశాలపై సుజనా చౌదరి మారు మాట్లాడలేకే  తలదించుకున్నారని రాజ్ నాథ్ ఎద్దేవా చేశారు. అంత‌కుముందు, అవిశ్వాసం సంద‌ర్భంగా...చంద్ర‌బాబు త‌మ మిత్రుడేన‌ని రాజ్ నాథ్ లోక్ స‌భ‌లో స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ్ నాథ్ వ్యాఖ్య‌ల‌తో టీడీపీ - బీజేపీల చీక‌టి ఒప్పందం బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News