తలనొప్పిగా మారిన రాజ్యసభ స్ధానాలు

Update: 2022-05-05 04:27 GMT
పార్టీకి దక్కబోయే రెండు రాజ్యసభ స్థానాలు నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. తమిళనాడులో ఏఐఏడీఎంకే అగ్రనేతలు ఓ పన్నీర్ సెల్వం, పళనిస్వామి లపై ఈ విషయంలో నేతల నుండి బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. జూన్ 2వ తేదీన రాష్ట్రంలోని 6 రాజ్యసభ ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది. అసెంబ్లీలోని ఎంఎల్ఏల సంఖ్యా బలం కారణంగా 4 డీఎంకేకి, మిగిలిన 2 స్ధానాలు ఏఐఏడీఎంకి దక్కుతాయి.

ఈ రెండు స్థానాలు తమకు కేటాయించమంటే కాదు తమకే కావాలని నేతల మధ్య పోటీ తీవ్రమైపోయింది. దీంతో ఏమి చేయాలో మాజీ ముఖ్యమంత్రులకు అర్థం కావటంలేదు. మరో

ఐదు సంవత్సరాలు  పార్టీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి రావటంతోనే రెండు రాజ్యసభ ఎంపీ పదవులకు పార్టీలో విపరీతమైన పోటీ పెరిగిపోతోంది. పార్టీ కోసం తాము పడిన కష్టాన్ని గుర్తు చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు రకరకాలుగా వీరిద్దరిపై ఒత్తిడి పెంచేస్తున్నారు.

పార్టీకి చెందిన ఎస్ఆర్ బాలసుబ్రమణ్యం, ఎ నవీతకృష్ణన్ పదవీకాలం ముగిసిపోతోంది. ఈ స్ధానాలను దక్కించుకునేందుకు సెమ్మలై, డీ. జయకుమార్, సీవీ షణ్ముగం, గోకుల ఇందిర, డీ. ప్రభాకర్, సెల్వరాజ్, వేణుగోపాల్, బీఎం సయ్యీద్ తదితరులు తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరు వ్యతిరేకం అవ్వటం ఖాయమని అగ్రనేతలిద్దరు తలలు పట్టుకున్నారు. వీళ్ళల్లో పార్టీకి లాయల్ గా ఉండేవారెవరు, పదవి రాదని తెలియగానే తిరుగుబాటు లేవదీసేదెవరో తెలీక నానా అవస్తలు పడుతున్నారు.

ఒకవైపు పార్టీలోన ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో అసలు పార్టీ తనదే అంటు శశికళ గోల కూడా ఎక్కువైపోతోంది. ఇదంతా సరిపోదన్నట్లు పార్టీకొచ్చే రెండు ఎంపీ స్ధానాల్లో ఒకటి మిత్రపక్షంగా తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు.

ఇటు సీనియర్ నేతలు, అటు బీజేపీ నేతల్లో ఎవరిని కాదన్నా సమస్యలు తప్పేట్లు లేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రెండు స్ధానాలను పన్నీర్ శెల్వం, పళనిస్వామి చెరొకటి పంచేసుకున్నారట. మరి వాళ్ళు ఎవరికి కేటాయించుకుంటారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News