వంగవీటి రంగా...రిలీజ్ కు ముందే సెన్సేషన్

Update: 2016-12-03 09:37 GMT
రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. ఆయన ఎంచుకునే సినిమాలే అలాంటివి. తాజాగా వంగవీటి రంగాపై తీస్తున్న సినిమా ఆడియో ఫంక్షన్ ఇవాళ ఉండడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. డిసెంబరు 23వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ రోజు ఆడియో రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందంటూ వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేయ‌డం - రంగారాధ మిత్ర‌మండ‌లి హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌థ్యంలో రామ్ గోపాల్ వ‌ర్మ ఈ రోజు రాధాకృష్ణతో భేటీ అయ్యారు.  వంగ‌వీటి సినిమా వివాదంపై ఇద్దరూ చ‌ర్చిస్తున్నారు. విజ‌య‌వాడలోని హెల్ప్ ఆసుప‌త్రిలో ఈ భేటీ కొన‌సాగుతోంది. సినిమాకు సంబంధించిన ప‌లు అంశాలను గురించి రాధాకృష్ణ‌కు వ‌ర్మ వివ‌రిస్తున్నారు. కాగా.... చర్చలు జరుగుతున్న ప్రాంతం బయట రంగా అభిమానులు పెద్ద ఎత్తున చేరారు.
    
కాగా... ఇంతకుముందు దీనిపై వర్మ మాట్లాడుతూ... వంగ‌వీటి సినిమా ఏ కులానికీ వ్య‌తిరేకం కాదని అన్నారు. సినిమా వ‌ల్ల మ‌ళ్లీ పాత రోజులు వ‌స్తాయని, గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌ని వస్తోన్న వాద‌న‌లు నిజం కావ‌ని అన్నారు. సినిమాలో అభ్యంత‌ర‌క‌ర‌మంటున్న పాట‌ను ఇప్ప‌టికే తీసేశామ‌ని, మూవీలో మ‌రే అభ్యంత‌ర‌క‌ర సీన్లు లేవని స్ప‌ష్టం చేశారు. సినిమాలో ఉన్న క‌థ అంతా వాస్త‌వమో కాదో సినిమా చూడ‌కుండానే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వర్మ అన్నారు.
    
సినిమా విడుద‌ల కాక‌ముందే సినిమాలో ఏముందో వారికెళా తెలుస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఒక‌రిని కించ‌ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేదని అన్నారు. గొడ‌వ‌లు కావ‌చ్చ‌ని ఎలా అంచనా వేస్తార‌ని అడిగారు. సినిమా మొత్తం ఎమోష‌న‌ల్ డ్రామాగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. వంగ‌వీటి ఆడియో ఫంక్ష‌న్‌ కి విజ‌య‌వాడ ప్ర‌జ‌లంద‌రినీ ఆహ్వానించాన‌ని అన్నారు. మరోవైపు వంగవీటి రాధాతో జరుగుతున్న చర్చల్లో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News