గాడ్ - సెక్స్ అండ్ ట్రూట్ (జీఎస్టీ) పేరిట ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించి దానిని వెబ్ వేదికగానే విడుదల చేసి సంచలన సృష్టించిన బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ... ఆ యత్నంతో చాలా చిక్కులనే ఎదుర్కోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. తాను అనుకున్న కథనాలు జనానికి నచ్చాలనేమీ లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేసే వర్మ... అసలు తన సినిమాను ఎవరు చూడమన్నారంటూ సూటిగానే ప్రశ్నిస్తారు. అయితే తన కెరీర్ మొత్తంగా చాలా డేరింగ్ గానే వ్యవహరించిన వర్మ... జీఎస్టీ పుణ్యమా అని పోలీస్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రత్యక్షంగా చవిచూస్తున్నారు. మొన్న హైదరాబాదు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన వర్మ... దాదాపుగా 3.30 గంటల పాటు పోలీసులు సంధించిన ప్రశ్నలకు చాలా ఇబ్బంది పడ్డారనే కథనాలే వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా విచారణలో భాగంగా పోలీసులను బురిడీ కొట్టించేందుకు వర్మ వేసిన ఎత్తులు కూడా పారలేదట. ఎందుకంటే... తనకు తెలియదన్న విషయాలకు సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు చూపడంతో వర్మ నిజంగానే షాక్ తిన్నారట. ఇక 3.30 గంటల విచారణను ముగించుకుని బయటకు వచ్చిన వర్మ... మళ్లీ ఈ శుక్రవారం మరోమారు విచారణకు రాక తప్పదు. ఈ క్రమంలో తనను పోలీసులు విచారించిన తీరుపై వివిధ కోణాల్లో వార్తలు - వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. అయితే అన్ని మీడియా సంస్థలను వదిలేసిన వర్మ.... టీవీ9ను మాత్రం గట్టిగానే పట్టేసుకున్నారని చెప్పాలి. తనను కించపరిచే ఉద్దేశంతోనే టీవీ9 వార్తా కథనాలను ప్రసారం చేసిందని ఆరోపిస్తున్న వర్మ... సదరు ఛానెల్ పై క్రిమినల్ కేసులు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కాసేపటి క్రితం ప్రత్యక్షమైన వర్మ... టీవీ9ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలే చేశారు.
తనపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన టీవీ9పై క్రిమినల్ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీటారు. తనను కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్ లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ పేర్కొన్నారు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని - ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్ లో ఆ కథనాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్ జోకర్స్ గా మార్చాలంటూ కూడా ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సదరు చానెల్ పై వర్మ కేసులు దాఖలు చేయాలని భావిస్తున్నారు.