కోర్టులో జైట్లీని ఆడుకున్న జెఠ్మాల‌నీ

Update: 2017-03-06 16:56 GMT
ప్ర‌ముఖ న్యాయ‌వాదీ - బీజేపీ మాజీ నేత‌ రామ్ జెఠ్మ‌లానీ మ‌రోమారు త‌న వాగ్దాటిని ప్ర‌ద‌ర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఢిల్లీ కోర్టులో ముప్పుతిప్ప‌లు పెట్టినంత ప‌నిచేశారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు జైట్లీ కార‌ణ‌మంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దాంతో ఆప్ నేత‌ - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పై జైట్లీ ప‌రువు న‌ష్టం కేసు వేశారు. ఈ కేసులో ఇవాళ వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఓపెన్ కోర్టు రూమ్‌ లో జ‌రిగిన క్రాస్ ఎగ్జామినేష‌న్‌ లో జెఠ్మ‌లానీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ' మీకు పూడ్చ‌లేని - వెల‌క‌ట్ట‌లేని న‌ష్టం జ‌రిగింద‌ని అన్నారు క‌దా.. మీ వ్య‌క్తిగ‌త‌ ప్ర‌తిష్ట‌కు అదేమైనా భంగం క‌లిగించిందా?' అని జైట్లీని జెఠ్మలానీ ప్ర‌శ్నించారు. మీరెందుకు పురువు న‌ష్టం కేసు వేశారో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అడిగారు. మీకు మీరు ఏర్ప‌ర్చుకున్న వ్య‌క్తిగ‌త విలువ త‌ప్ప ఈ కేసులో ఎటువంటి కార‌ణం క‌నిపించ‌డం లేద‌ని జెఠ్మ‌లానీ అన్నారు.

దీంతో జెఠ్మలానీ వ్యాఖ్య‌ల‌కు జైట్లీ కౌంట‌ర్ ఇస్తూ.. "నాకు జ‌రిగిన న‌ష్టంలో, నా ప‌రువుకు జ‌రిగిన న‌ష్టం స్వ‌ల్పం మాత్ర‌మే" అని అన్నారు. కేంద్ర మంత్రికి ఎటువంటి ఆర్థిక న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, అందుకే న‌ష్టాన్ని వెల‌క‌ట్ట‌లేక‌పోతున్న‌ట్లు ఆయ‌న చెబుతున్నార‌ని జెఠ్మ‌లానీ కోర్టులో వాదించారు. "డ‌బ్బు అంశంతో పోలిస్తే, త‌న‌కు జ‌రిగిన ప‌రువు న‌ష్టం కొద్ది మాత్ర‌మే, కానీ ప‌రువు న‌ష్టం వ‌ల్ల వ్య‌క్తులు మానసిక ఆందోళ‌న‌కు లోన‌వుతారు.  నా కేసులో అదే జ‌రిగింది" అని లాయ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు జైట్లీ స‌మాధానం ఇచ్చారు. త‌న స్థాయి, బ్యాక్‌ గ్రౌండ్‌, పేరుప్ర‌ఖ్యాత‌ల‌ను బ‌ట్టి త‌న‌కు జ‌రిగిన న‌ష్టం అమిత‌మైంద‌ని, అందుకే దాన్ని వెల‌క‌ట్ట‌లేనిదిగా పేర్కొన్న‌ట్లు జైట్లీ చెప్పారు. అంటే, మీకు మీరే వ్య‌క్తిగ‌తంగా గొప్ప‌వాళ్లుగా ఊహించుకుంటున్నార‌ని, దాన్ని ఆర్థిక న‌ష్టంగా పేర్కొన‌లేక‌పోతున్న‌ట్లు లాయ‌ర్ జెఠ్మ‌లానీ అన్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీడియా చెబుతున్న విష‌యాల వ‌ల్లే తాను ఆ అభిప్రాయానికి వచ్చినట్లు జైట్లీ కౌంట‌ర్ ఇచ్చారు. న‌ష్టాన్ని పూడ్చ‌లేమంటున్న జైట్లీ మ‌రి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చేందుకు ఎటువంటి రిపేర్ చేస్తున్నార‌ని తిరిగి జెఠ్మ‌లానీ ప్ర‌శ్నించారు.

ప‌రువున‌ష్టం కేసులో జైట్లీ సుమారు 10 కోట్ల ప‌రిహారాన్ని కేజ్రీవాల్ నుంచి డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా జైట్లీ వేసిన ప‌రువున‌ష్టం కేసులో జెఠ్మలానీ కేంద్ర మంత్రిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించడం సంచ‌ల‌నం రేకెత్తించింది. ఈ కేసులో మళ్లీ మంగళవారం వాదనలు జరగనున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News