ఆ గవర్నర్‌కు ఇక మూడినట్లే!

Update: 2015-07-09 12:13 GMT
ఇప్పటి వరకూ రాజ్యాంగ పదవిలో కొనసాగిన మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌ ఇక జైలు ఊచలు లెక్కబెట్టే రోజు దగ్గర్లోనే ఉంది! ఇప్పటి వరకూ రాజభవన్లో రాజభోగాలు అనుభవించిన ఆయన.. ఇక ఇప్పుడు చిప్పకూడు తినాల్సింది. రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు కారణం దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న వ్యాపం కుంభకోణంపై సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే!

నేరానికి భయానకం తోడైన వ్యాపం కుంభకోణంపై దేశవ్యాప్తంగా గగ్గోలు రేగుతోంది. దీనిపై దాఖలైన తొమ్మిది పిటిషన్లపై సుప్రీం కోర్టు కూడా స్పందించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించడమే కాకుండా దర్యాప్తు పూర్తిగా తమ పర్యవేక్షణలో జరగాలని కూడా ఆదేశించింది. అంతేనా.. ఇప్పటి వరకు గవర్నర్‌ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్రాన్ని, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది. తద్వారా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

వాస్తవానికి, ఫారెస్టు గార్డుల నియామకానికి సంబంధించి ఐదుగురి నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌ గవర్నర్‌పై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అయితే, తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానంటూ గవర్నర్‌ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ప్రొటోకాల్‌ను పాటించాలని కోర్టు ఎస్టీఎఫ్‌కు సూచించింది. అనంతరం, గవర్నర్‌ యాదవ్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవీ విరమణ చేస్తారని, గవర్నర్‌ పదవి నుంచి దిగిపోతారని, ఆ వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంటామని ఎస్టీఎఫ్‌ ప్రకటించింది. కానీ, రాజ్యాంగ హోదాలో ఉన్నా నేరం నుంచి తప్పించుకోలేడని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వివిధ వ్యక్తులు, సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దానిమీదే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

కోర్టు తీర్పు ప్రకారం గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌ ఇవాళో రేపో రాజీనామా చేయక తప్పదు. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే కేంద్రం ఆయనను తప్పించకా తప్పదు. ఆ వెంటనే ఎస్టీఎఫ్‌ ఆయనను అరెస్టు చేసి విచారిస్తుంది. ఆ తర్వాత రాజ్‌భవన్‌ నుంచి ఆయన నేరుగా జైలుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఇదే కేసులో ఆయన కొడుకు చనిపోయాడు. ఇప్పుడు గవర్నర్‌ జైలుకు వెళ్లనున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ లంచం తీసుకున్న దానికి ఫలితమిది!!

Tags:    

Similar News