'కొత్త రాష్ట్రప‌తి'ని ప్ర‌జ‌లు మాత్రం ఓడించారు

Update: 2017-06-20 07:46 GMT
కొన్ని సంద‌ర్భాల్లో తీసుకునే రాజ‌కీయ నిర్ణయాలు సృష్టించే సంచ‌ల‌నం అంతా ఇంతా అన్న‌ట్లుగా ఉండ‌వు. తాజాగా బీజేపీ డిసైడ్ చేసిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక కూడా ఇదే రీతిలో ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఊహించ‌నిరీతిలో బీహార్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్‌ ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి మోడీ అండ్ కో ఇచ్చిన స‌ర్ ప్రైజ్ అంతా ఇంతా కాదు.

లోప్రొఫైల్ మొయింటైన్ చేసే రాజ్ నాథ్‌ ను సౌమ్యుడిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తారు. ప్రచారం మీద పెద్ద ఫోక‌స్ చేయ‌ని ఆయ‌న బీజేపీ అధినాయ‌క‌త్వంతో మంచి సంబంధాలు ఉంటాయ‌ని చెబుతుంటారు. కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కు స‌న్నిహితుడైన ఆయ‌న‌కు సంబంధించిన ఒక కొత్త కోణం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

బీజేపీ అధినాయ‌క‌త్వం మ‌న‌సు దోచుకొని రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎంపికైన రామ్‌ నాథ్ ను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో మాత్రం చేదు అనుభ‌వ‌మే ఉంది. ఒక‌టి కాదు.. రెండుసార్లు ఆయ‌న ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి ఓట‌మి పాలు కావ‌టం విశేషం. బీజేపీలో చేరిన రామ్ నాథ్‌ ను తొలిసారి 1991లో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. యూపీలోని ఎస్సీ రిజ‌ర్వ్ డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 1994లోనూ.. 2006లోనూ రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే 12 ఏళ్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేసిన త‌ర్వాత 2007లో త‌న సొంత జిల్లా అయిన భోగినీపూర్ నుంచి యూపీ అసెంబ్లీకి పోటీ చేసినా గెల‌వ‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. అంటే.. తొలి ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాలైన 16 ఏళ్ల త‌ర్వాత‌..అసెంబ్లీ సీటుకు పోటీ చేసినా ఆయ‌న విజ‌యం సాధించ‌లేక‌పోయారు. ప్ర‌జ‌ల మ‌న‌సును దోచుకోలేని రామ్ నాథ్‌.. త‌న‌కు అప్ప‌గించిన ప‌ని విష‌యంలో బీజేపీ అధినాయ‌త్వం మ‌న‌సుల్ని మాత్రం భారీగా దోచుకుంటార‌ని చెబుతారు. మోడీ చేతిలోకి బీజేపీ వెళ్లిన నాటి నుంచి ఆ పార్టీతో ఏ మాత్రం పొస‌గ‌ని బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ తో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న రామ్ నాథ్ మెలగ‌టం విశేషం. ఏమైనా.. కొత్త రాష్ట్రప‌తి గ‌తంలో రెండుసార్లు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓడిన వైనం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ప్ర‌జ‌లు ఎమ్మెల్యేగా కూడా ఒప్పుకోని నేత‌.. సొంత పార్టీ ఆశీస్సులు పుష్క‌లంగా ఉంటే రాష్ట్రప‌తి కావొచ్చ‌న్న మాట‌కు రామ్ నాథ్ నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తార‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News