రామోజీ పేపర్లో జగన్ కు ఫుల్ ప్రయారిటీ

Update: 2017-05-17 06:45 GMT
పత్రికా వ్యాపారం వల్ల ఏర్పడిన పోటీ, రాజకీయ విధానాల్లో వైరుధ్యాలు, రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో జరిగిన పరిణామాలు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారాలు వంటి అనేక వ్యవహారాల నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డికి రామోజీరావుకు చెందిన ఈనాడు పత్రిక ఎప్పుడూ అత్యంత తక్కువ కవరేజి ఇచ్చేది. ఇది తెలుగు ప్రజలందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు అయిదు నిమిషాలు మాట్లాడితే అరపేజీ నింపేసే ఈనాడు జగన్ ఎంత గొంతు చించుకున్నా... ఆయన సభలకు ఎంతగా జనం పోటెత్తినా కూడా ఎక్కడో సింగిల్ కాలమ్ కు పరిమితం చేసేది. అలాంటిది కొద్దికాలంగా ఈనాడు రూటు మార్చింది. జగన్ కు తెగ ప్రయారిటీ ఇస్తోంది.
    
గత ఏడాదిన్నర కాలంగా మారిన ఈ ధోరణి రీసెంటుగా మరింత పెరిగింది. తాజాగా ప్రధాన మంత్రికి జగన్ లేఖ రాసిన విషయంలో ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనాలపై జగన్ విరుచుకుపడుతూ.. తాను మోడీని కలవడాన్ని టీడీపీ తప్పుపడుతుండడంపైనా మండిపడుతూ సోమవారం ప్రెస్ మీట్ పెట్టగా ఈనాడులో చెప్పుకోదగ్గ స్థాయిలో కవర్ చేశారు. దీనిపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈనాడు క్రమంగా జగన్ కు ప్రాధాన్యం పెరగడం ఏమైనా రాజకీయ సమీకరణల మార్పునకు సంకేతమా అని వినిపిస్తోంది. కొద్దికాలంగా ఈనాడుకు చంద్రబాబు కంటే మోడీయే ఇంపార్టెంటుగా మారిన నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా మారుతున్న జగన్ కు ప్రయారిటీ పెంచారని భావిస్తున్నారు.
    
మరోవైపు ఇక్కడా వ్యాపార కోణం కూడా ఉంది. జగన్ కు చెందిన సాక్షి పత్రిక ఇప్పుడు ఈనాడు కు ప్రధాన పోటీ దారు కాదు. సాక్షిని దాటేసేందుకు ఆంధ్రజ్యోతి ఉరకలేస్తోంది. పైగా ఏపీలో ప్రభుత్వం వద్ద ఈనాడు కంటే జ్యోతికే వెయిట్ ఎక్కువ. ప్రభుత్వ కార్యక్రమాల రైట్స్ అన్నీ జ్యోతి, ఏబీఎన్ వే. ఏ ఛానల్ కైనా ఏపీ గవర్నమెంటు ఫీడ్ ఏబీఎన్ నుంచే రావాలి. మరోవైపు సర్క్యులేషన్ పరంగా ఈనాడుతో పోటీకి జ్యోతి దూసుకొస్తోంది. ఈ కారణంగానూ వ్యాపారపరంగా, రాజకీయంగానూ జ్యోతికి వ్యతిరేకమైన జగన్ తో మంచిగా ఉండాలనేది కూడా ఈనాడు అధినేతల ప్లాన్ కావొచ్చని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News