ఈ మ‌హిళా ఎంపీలో స్పెషాలిటీస్ అన్ని ఇన్ని కావు!

Update: 2019-05-29 05:36 GMT
ఈసారి ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక‌త ఏమంటే.. గ‌తంతో పోలిస్తే.. ఈసారి ఎక్కువ‌మంది మ‌హిళా ఎంపీలు ఎన్నిక‌య్యారు. వారిలో.. క‌టిక పేద‌రికం నుంచి వ‌చ్చిన సామాన్యుల నుంచి సినీ స్టార్స్ వ‌ర‌కూ ఉన్నారు. గ్లామ‌ర్ తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి గెలుపొందటం అంద‌రూ చేసే ప‌ని. కేవ‌లం క‌ష్టాన్ని న‌మ్ముకొని.. ప్ర‌జాసేవే లక్ష్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. క‌ష్టాలు ఎదుర్కొని.. స‌వాళ్ల‌కు సై అంటూ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన విజ‌యం సాధించ‌టం అంత తేలికైన విష‌యం కాదు.

అలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితిని ఎదుర్కొని విజేత‌గా నిలిచిన ఒక మ‌హిళ రియ‌ల్ స్టోరీ ఇది.  విద్యావంతుల‌కు నిల‌యంగా చెప్పే కేర‌ళ రాష్ట్రం నుంచి ఎన్నిక‌ల్లో ఎంపికైన ఏకైక మ‌హిళ కాంగ్రెస్ ఎంపీ ర‌మ్య హ‌రిదాస్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆమెకు ఎలాంటి పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. పేద‌రికంలో పుట్టి పార్ల‌మెంటు వ‌ర‌కూ ఆమె అడుగులు ఎలా ప‌డ్డాయో చూస్తే.. ఒక సినిమా చూసిన‌ట్లుగా అనిపించ‌క‌మాన‌దు.

ఒక సాధార‌ణ దిన‌స‌రి కూలీ కుమార్తె.. క‌మ్యునిస్టుల కంచుకోట‌ను బ‌ద్ధ‌లు కొట్టి ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు ర‌మ్య‌. 32 ఏళ్ల ద‌ళిత ఎంపీ అయిన ఆమె వివ‌రాల్లోకి వెళితే..కేర‌ళ‌లోని పాలక్కాడ్ జిల్లా అల‌త్తూర్ ఎంపీగా ఆమె ఎన్నిక‌య్యారు. ఆమె తండ్రి దిన‌స‌రి కూలీ. మ‌హిళా కాంగ్రెస్ నాయ‌కురాలైన త‌ల్లి రాధ స్ఫూర్తితో ర‌మ్య చిన్న‌త‌నం నుంచే సామాజిక అంశాల మీద దృష్టి పెట్టేవారు. తొలుత కేర‌ళ కాంగ్రెస్ విద్యార్థి సంఘంలోనూ.. త‌ర్వాత యువ‌జ‌న కాంగ్రెస్ లోనూ చురుగ్గా ప‌ని చేశారు.

2010లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ యువ నాయ‌క‌త్వం కోసం రాహుల్ ప్ర‌త్యేకంగా కొంద‌రిని ఎంపిక చేశారు. ఆ వెతుకులాట‌లో క‌నిపించారు ర‌మ్య‌.మంచి వాగ్ధాటి.. విష‌యాల మీద అవ‌గాహ‌న‌.. సృజ‌నాత్మ‌క‌త‌.. ద‌ళితుల అభివృద్ధి.. అంశాల మీద మంచి ప‌ట్టు ఉన్న ఆమెను రాహుల్ ప్రోత్స‌హించారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమెను ఎస్సీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన అల‌త్తూర్ ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దింపారు. 2009 నుంచి ఎంపీగా సాగుతున్న సీసీఐఎం నేత పీకే బిజూపై ఆమె పోటీ చేశారు. ఆమె నేప‌థ్యంలో..క‌ష్ట‌ప‌డే త‌త్త్వం.. ఆమె మాట‌లు ఓట‌ర్ల దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. కేర‌ళ నుంచి ఎన్నికైన ఏకైక మ‌హిళా ఎంపీ అన్న రికార్డును సొంతం చేసుకోగ‌లిగారు. క‌ష్ట‌ప‌డినోళ్ల‌కు ఫ‌లితం ఉంటుంద‌న్న విష‌యాన్ని ఆమె మ‌రోసారి నిరూపించారు.
Tags:    

Similar News