బాబుకు బీపీ పెంచే డిమాండ్‌ కు రావెల మ‌ద్ద‌తు

Update: 2017-09-28 23:30 GMT
మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు సుదీర్ఘ గ్యాప్ త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో మంత్రి ప‌ద‌వి నుంచి ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తొల‌గించిన త‌ర్వాత పెద్ద‌గా వార్త‌ల్లో క‌నిపించ‌ని మాజీ మంత్రి రావెల‌... తాజాగా క‌ల‌క‌లం రేపే కామెంట్ చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఇర‌కాటంలో పడేసిన ద‌ళితుల వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో సంచ‌లన‌ ప్ర‌క‌ట‌న చేశారు. వర్గీకరణ కోసం ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు తెలిపారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో గుర్రం జాషువా విగ్రహావిష్కరణను మాజీ మంత్రి - ఎమ్మెల్యే రావెల కిశోర్‌ బాబు - ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ న్యాయబ‌ద్ద‌మైన డిమాండ్ అని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఇచ్చిన హామీని నిలుపుకోవాల‌ని కోరారు. త‌న‌కు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణ ముఖ్యమని మాజీ మంత్రి రావెల అన్నారు. మందకృష్ణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాజీనామా చేస్తానని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌ర్గీక‌ర‌ణ హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆచ‌ర‌ణ రూపంలో క్రియాశీలంగా ముందుకు సాగడం లేద‌నే అభిప్రాయాలు ఉన్న‌ స‌మ‌యంలో తాజాగా రావెల కిశోర్ బాబు చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

కాగా, ఈ ఏడాది జూలైలో ఎమ్మార్పీఎస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన కురుక్షేత్ర స‌భ‌ను ఏపీ స‌ర్కారు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై మండిప‌డ్డారు. త‌మ‌ సహకారంతో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేసుకోవడంతో పాటు - ఏపీలో అధికారం చేపట్టిందని మంద‌కృష్ణ గుర్తు చేశారు.  ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా ఉంటామని చెబితే పైసాకు ఆశించకుండా చంద్ర‌బాబును నమ్మామ‌ని అయితే త‌మ సహకారంతో గెలిచిన చంద్రబాబు మూడేళ్లుగా వర్గీకరణను మూలన పెట్టారని మండిప‌డ్డారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులకు ఉన్నత పదవులు ఇస్తున్నారని త‌మ జాతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌ ఆవేదన చెప్పుకొనేందుకు సభ పెట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటున్నారని విమ‌ర్శించారు.
Tags:    

Similar News