బాబుతో చెప్పే ఆ మాట చెప్పావా రవీంద్రబాబు?

Update: 2016-08-18 06:19 GMT
అధినేత ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం చెలరేగిపోతున్న వైనం కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశం మీద తనకు తోచినట్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ.. తొందరపడకూడదన్నట్లుగా ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముడు ఒకరు. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉండటం.. దీనిపై జాతీయస్థాయిలోనూ పలు పార్టీలు మద్ధతు పలుకుతున్న వేళ.. మోడీ సర్కారు మాత్రం నో అంటే నో అంటున్న పరిస్థితి. హోదాపై కమలనాథుల తీరుతో ఏపీ ప్రజలు గుర్రుగా ఉండటమే కాదు.. హోదా అంశం ఏపీలో ఇప్పుడు సెంటిమెంట్ గా మారింది.

ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా పేరుతో మిత్రబంధాన్ని తుంచుకున్న బాబుకు పోయిందేమీ లేదు. కానీ.. భవిష్యత్ పరిణామాల్ని అంచనా వేయటంలో ఏ మాత్రం తప్పు దొర్లినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం బాగా తెలుసు కనుకే తొందరపడని చంద్రబాబు.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేంద్రంతో పోరాటంతో వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువన్న విషయాన్ని  అర్థం చేసుకొని ఒక అడుగు ముందుకు వేసినట్లే వేసి.. ఒక అడుగువెనక్కి వేస్తూ బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును తెలుగు తమ్ముఢు ఒకరు తేల్చేశారు. ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్ తో కూడుకున్నదని.. ఏపీకి ప్యాకేజీ కాకుండా హోదా కోసం పోరాడతామంటూ చెబుతున్నారు అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్ర బాబు. హోదా అంశంపై కేంద్రానికి గడువు ఇస్తామని.. ఒకవేళ కేంద్రం కానీ సానుకూలంగా స్పందించకుంటే మోడీ సర్కారుతో తెగతెంపులకు  సిద్ధమని తేల్చేశారు. ఆచితూచి వ్యవహరిస్తున్న అధినేత తీరుకు భిన్నంగా ‘తమ్ముడు’ రవీంద్రబాబు తెగతెంపుల మాట చెప్పటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఆయన విడాకుల మాటను చంద్రబాబు అనుమతితోనే చెప్పారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News