లంచాలు డిమాండ్ చేస్తున్న టీఆర్ ఎస్ నేత‌లు

Update: 2016-11-03 16:29 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ త‌న ఎదురుదాడిన జోరును పెంచింది. రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌తో పాటుగా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో టీఆర్ ఎస్ నేత‌ల‌పై కొత్త ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు దివంగ‌త సీఎం  వైఎస్ ఆధారంగా కేసీఆర్‌ ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ పాలనలో ప్రజలకు మంచి జరుగకపోగా, ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి ప్రశ్నిస్తే గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారని  3,100 కోట్ల రీయింబర్స్ మెంట్ బకాయిల్లో వెయ్యికోటు మాత్రమే విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటున్నార‌ని రావుల మండిప‌డ్డారు. ఇటీవల విద్యార్థి లోకం రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తే మరో 300 కోట్లు విడుదల చేశారని పేర్కొంటూ ఆ 300 కోట్లు కూడా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేందుకు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, ఇటీవల డెంగీ - విషజ్వరాలతో హైదరాబాద్ తో సహా రాష్టం అల్లకల్లోలం అవుతుంటే పట్టించుకున్నా పాపాన పోలేద‌ని రావుల‌ మండిప‌డ్డారు. వాస్తుపేరిట సచివాలయం మొత్తాన్ని  సీఎం కేసీఆర్  కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రావుల ప్ర‌శ్నించారు. దివంగ‌త సీఎం రాజశేఖర్ రెడ్డి కట్టించిన అధికారిక నివాస గృహం ఉండ‌గా మరో భవనం నిర్మించుకోవాల్సిన అవసరం ఏమున్నదని ఆయ‌న నిల‌దీశారు.

ఎవరు అడిగారని ప్రభుత్వంపై సర్వేలు చేయించుకుంటున్నారని ప్ర‌శ్నించిన రావుల ప్రభుత్వంపై ప్రజల్లో ప్రజాధరణ తగ్గిందనే అనుమానంతో సర్వేలను ఆశ్ర‌యిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది కానీ ప్రతిపక్షాలను వేదించడంలో సఫలీకృతం అయిందన్నారు. అధికార పార్టీలో చేరుతున్న నాయ‌కుల‌ను చూసి సంబర ప‌డ‌వ‌ద్ద‌ని...అధికారం పోయిన తరువాత ఎగిరిపోయే పక్షులు కూడా ఇవేన‌ని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే  ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండ‌టం స‌రైన విధానం కాద‌న్నారు. రైతాంగ సమస్యలపై ప్ర‌భుత్వం స్పందించాల‌ని రావుల డిమాండ్ చేశారు. 'రాష్ట్రంలో అంతా బాగుంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్న టీఆర్ఎస్ నేత‌లు...ఏ రైతుకైనా రుణమాఫీ, ఇన్ పుట్‌ సబ్సిడీ అందిందో ప్ర‌క‌టించాలి. టీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ చేస్తున్నాం. ఏ గ్రామానికైనా వెళ్దాం. ఏ ఒక్కరైతుకైనా రైతు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ కొత్తగా బ్యాంకుల్లో రుణాలు వచ్చాయో మీరు నిరూపించ‌గ‌ల‌రా? టీఆర్ఎస్ నేతల సాక్షిగా ఈ అంశాల్లో రైతులు ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ట్లు మేం నిరూపిస్తాం. అందుకు వారు సిద్ధమేనా?" అని రావుల‌ స‌వాల్ విసిరారు. కరువు సాయం కింద కేంద్రం ఇచ్చిన 791 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా రైతులకు చేరలేదని, నకిలీ విత్తనాలతో రైతాంగం నిండా మునిగిపోతే, నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలతో రైతులకు 60 శాతం నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సమర్పిస్తే ఆ నివేదకను తొక్కిపెట్టి విత్తన కంపెనీలకు కొమ్ముకాశారని మండిప‌డ్డారు. కనీసం పండిన పంటలకు కూడా కనీస మద్దతు ధర దక్కక మార్కెట్లలో దళారులు సిండికేట్ల అవతారమెత్తి అమాంతం ధరలు తగ్గిస్తున్నాపట్టించుకోవడం లేదని రావుల ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News