రూ. 2000 నోటు చలామణిపై .. ఆర్బీఐ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2020-08-26 13:50 GMT
2016 నవంబర్ 8న ప్రధానమంత్రి మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు ఇక చెల్లవని ప్రకటించారు. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి చిన్న నోట్లు, కొత్త నోట్లు పొందాలని పిలుపునిచ్చారు. నల్లధనాన్ని అరికట్టేందుకు, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేశారు. రూ.500, రూ.వెయ్యి నోట్లు వల్ల అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉందని, వాటిని దాచుకోవడం సులువని.. అలాంటి నోట్లను రద్దు చేస్తే అవినీతి అంతం అవుతుందని మొదటి నుండి ప్రజలు కోరుతూనే వచ్చారు. వారు కోరుకున్నట్టే నాలుగేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేశారు. వాటి స్థానంలో రూ. వంద, రూ. 500, రూ. 2000 నోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి వాటి కంటే విలువైన రూ. 2000 ప్రవేశ పెట్టడం ఎందుకని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. దాన్ని రద్దు చేయాలని కూడా ప్రజలు డిమాండ్ చేశారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ తాజా నివేదికను విడుదల చేసింది. అందులో రూ. 2000 నోటు పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో 2000 నోట్ల చలామణిని తగ్గించేందుకు గత ఆర్థిక సంవత్సరమే ఆ నోట్లను ప్రింట్ చేయడం ఆపేసినట్లు పేర్కొంది. క్రమేణా రూ. 2000 నోటు చలామణి పూర్తిగా తగ్గిస్తామని కూడా పేర్కొంది. నోట్ల రద్దు అనంతరం.. తిరిగి పెద్ద నోట్లు చలామణి లోకి వచ్చినప్పుడు.. ఎక్కడ చూసినా రూ.2000 నోట్లే దర్శనమిచ్చేవి. ఇప్పుడు మార్కెట్లో అవి పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం ఆ నోట్ల చలామణిని తగ్గించడమే. 2018 మార్చి లో దేశంలో 33, 632 లక్షల రూ. 2000 నోట్లు చలామణిలో ఉండగా.. ఈ ఏడాది మార్చికి వాటి సంఖ్య 27, 398 లక్షలకు పడిపోయింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో రూ. 2000 నోట్ల పరిమాణం కేవలం 3.3 శాతమేనని ఆర్బీఐ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ 2000 నోటు కూడా ప్రింట్ చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. కానీ అదే సమయంలో దేశంలో రూ 200, రూ 500 నోట్ల చలామణి పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. గత ఏడాది 1200 కోట్ల రూ. 500 నోట్లను ముద్రించారు. 205 కోట్ల రూ. 200 కోట్లను ముద్రించింది. రూ 100, రూ. 50 నోట్లను కూడా భారీగానే ప్రింట్ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న అన్ని నోట్లలో 2.96 లక్షల నకిలీ నోట్లు ఉన్నాయి అని ఆర్బీఐ వెల్లడించింది. ఆ నోట్లను అరికట్టేందుకు వార్నిష్డ్ రూ. 100 నోట్లను ముద్రించాలని రిజర్వు బ్యాంకు ప్రయత్నించినా కరోనా కారణంగా అది సాధ్యపడలేదు.
Tags:    

Similar News