బంగారం వైపు మొగ్గుచూపుతున్న ఆర్బీఐ ..కారణం ఏంటంటే ?

Update: 2020-08-19 16:31 GMT
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలు పెంచుకోవడంపై పూర్తి దృష్టి పెట్టింది. ఆర్బీఐ లో బంగారం నిల్వలను పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత శుక్రవారంసమావేశమైన ఆర్బీఐ బోర్డు పసిడికి అనుకూలంగా నిల్వల్ని పెంచుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించి , బంగారం నిల్వలు 7 శాతంగా నుండి 10 శాతానికి పెంచాలని లక్ష్యం అని నిర్ణయించారు. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికలు రూపొందించడంతో పాటుగా, అక్టోబర్ 23న మరోసారి సెంట్రల్ బ్యాంకు బోర్డు సమావేశమైనప్పుడు దీనిపై కూలంకశంగా చర్చించనుంది. ఈ మద్యే ఆర్బీఐ అధికారుల్లో ఒకరు బోర్డు సమావేశంలో బంగారం నిల్వలు పెంచుకోవడం, యూఎస్ సెక్యూరిటీస్ తగ్గింపు అంశాన్ని తీసుకువచ్చారని వార్తలు వస్తున్నాయి.

మన దేశ ఫారెక్స్ నిల్వలు ఆగస్ట్ 7, 2020 నాటికి 538.19 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ఫారెన్ ఎక్స్చేంజ్ అసెట్స్ దాదాపు 492.29 బిలియన్ డాలర్లు, గోల్డ్ రిజర్వ్స్ 39.785 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాలర్ కొనుగోలు, బంగారం కొనుగోలు అంశంపై చర్చించారని తెలుస్తోంది. అమెరికా సెక్యూరిటీలను తగ్గించుకొని, పసిడి నిల్వలను పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని బోర్డు సభ్యుల్లో ఒకరు చెప్పారని తెలుస్తుంది. ఇది ఆర్బీఐ తీసుకోవాల్సిన సాంకేతికపరమైన అంశమని చెబుతున్నారు. 1992లో బంగారాన్ని తక్కువ మొత్తానికి అమ్మవలసి వచ్చిందని, నాటి బంగారం నిల్వలు భారత్ రక్షణకు ఉపకరించాయని కొంతమంది చెప్పవచ్చునని, కానీ ప్రస్తుతం మనం ఆ పరిస్థితుల్లో లేమని కొందరి అభిప్రాయం. అయితే, బంగారం నిల్వలు అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉపయోగపడవని, అయితే నిల్వల కేటాయింపును విస్తృతే చేయడం మంచిదని చెబుతున్నారు

గత అయిదేళ్లుగా బంగారు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయని, 1991లో ఈ నిల్వలు భారత్‌ కు మద్దతు ఇచ్చాయని, కేటాయింపులు పెంచేందుకు ఆర్బీఐ అవలంభించే వ్యూహాన్ని పరిశీలించాలని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అన్నారు. బంగారం నిల్వలు సంక్షోభ సమయాల్లో ఉపయోగపడతాయి. మూడు దశాబ్దాల క్రితం పసిడి నిల్వలు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సాధారణ ఆర్బీఐ సంక్షోభ సమయాల్లో అమెరికా డాలర్లు లేదా బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తుంది. బంగారం భద్రమైన పెట్టుబడి. ద్రవ్యోల్భణం కానీ, ఆర్థఇక సంక్షోభాలు కానీ ఏవీ పసిడిపై ప్రభావం చూపించవు. ప్రస్తుతం కరోనా ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు మరికొన్ని నెలల పాటు ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉండనుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా బంగారు నిల్వలు పెంచుకునే అంశంపై దృష్టి సారించింది.

ప్రస్తుత కరోనా సంక్షోభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వైపు చూస్తాయి. ద్రవ్యలోటు 11 శాతం నుండి 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆదాయాలు భారీగా తగ్గుతున్నాయి. పన్ను చెల్లింపులు తగ్గాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ వద్ద ఉన్న నిధులు ప్రభుత్వాలకు ఉపయోగపడతాయి. ఈ ఏడాది ఆర్బీఐ 618 టన్నుల బంగారాన్ని ప్రభుత్వానికి ఇచ్చి 90 శాతం మార్కెట్ వ్యాల్యూ వద్ద తిరిగి కొనుగోలు చేసింది.రూ.2.33 లక్షల కోట్లనూ బదలీ చేసింది.
Tags:    

Similar News