మోసాలు.. బ్లాక్ మ‌నీకి చెక్‌: 2000 నోటు క‌నిపించ‌దా?

Update: 2021-03-18 01:00 GMT
దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఒక విప్ల‌వాత్మ‌క‌మైన మార్పును తెచ్చామ‌ని.. చెప్పిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. 2016లో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను రాత్రికి రాత్రి ర‌ద్దు చేశారు. ఇది పెనుకుదుపుల‌కు దారితీసింద ‌ని, ఇప్ప‌టికీ దేశ ఆర్థిక రంగంలో దీని తాలూకు ఇబ్బందులు క‌నిపిస్తున్నాయ‌ని, చిన్న ప‌రిశ్ర‌మ‌లు, ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌ని ఆర్ధిక నిపుణుల నుంచి విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. మోడీ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రూ.500, అదేస‌మ‌యంలో వెయ్యి రూపాయ‌ల నోటు స్థానంలో ఏకంగా రూ.2000 నోటును తీసుకువ‌చ్చారు.

బ్లాక్ మ‌నీని అరిక‌ట్టే క్ర‌మంలో రూ.1000 నోటును ర‌ద్దు చేశామ‌ని చెప్పిన మోడీ.. అనూహ్యంగా రూ.2000 నోటును ప్ర‌వేశ పెట్ట‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. అయితే.. దీనికి మోడీ స‌ర్కారు అప్ప‌ట్లో ఎలాంటి వివ‌ర‌ణా ఇవ్వ‌లేదు. కానీ, రాను రాను.. ఈ పెద్ద నోటు రూ.2000ను చ‌లామ‌ణిని త‌ప్పించేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా రూ.2000 నోటు ముద్ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు .. ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆన్స‌ర్ ఇస్తూ.. రూ.2000 నోటు ముద్ర‌ణను నిలిపి వేశామ‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అంతేకాదు.. ముద్ర‌ణ విలువ‌ను కూడా త‌గ్గించేశామ‌న్నారు.

రెండేళ్లుగా ఆగిపోయి..
మంత్రి అనురాగ్‌ చెప్పిన దాని ప్ర‌కారం.. 2019లో 329.10 కోట్ల విలువ చేసే 2000 రూపాయిల నోట్లు పంపిణీలో ఉండ‌గా,  మార్చ్ 2020 నాటికి వీటి విలువ 273.98 కోట్ల రూపాయలకు పడిపోయింది.(త‌గ్గించేశారు.) అంతేకాదు, గత రెండు సంవత్సరాలలో కొత్తగా 2000 రూపాయిల నోట్లను ప్రచురించలేదని మంత్రి చెప్పారు. దీనిని బ‌ట్టి దేశంలో 2000 రూపాయిల నోట్ల‌ను త‌గ్గించేందుకు మోడీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌ని తెలుస్తోంది.  

మోడీ బాట‌లో ఆర్బీఐ!
ఇక‌, మోడీ విధానాన్ని అనుసరిస్తూ ఆర్‌బీఐ కూడా 2000 రూపాయిల నోట్లను ఏటీఎంల నుంచి తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. దాంతో 2020 మార్చి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల 40 వేల ఏటీఎంల నుంచి 2000 రూపాయిల నోట్లను తొలగించి వాటి స్థానంలో 500, 200, 100 రూపాయిల నోట్లను ప్రవేశపెట్టారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. త్వ‌ర‌లోనే 2000 రూపాయల నోట్లు కనుమరుగవ‌నున్నాయ‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు.

వ్యూహం ఇదేనా?
భారీ ఆర్ధిక కుంభకోణాలు జరగకుండా ఆపాలంటే పెద్ద నోట్ల సరఫరాను కూడా ఆపడం ఒక పరిష్కారమని ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి నోట్ల పంపిణీ ఆగిపోతే, మోసాలు తగ్గుతాయని అంటున్నారు. అమెరికా, యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే అక్కడ 100 డాలర్లు, లేదా పౌండ్లను మించిన నోట్లు ఉండవు. సో.. ఇదే విధానాన్ని క్ర‌మేణా భార‌త్‌లోనూ అమ‌లు చేయాల‌ని మోడీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తే అన్ని లావాదేవీలు రికార్డులో ఉండి, ప‌న్ను రాబ‌డులు పెంచ‌డంతోపాటు..  ఆర్ధిక నిర్వహణలో అవకతవకలను తగ్గిస్తుందనేది కేంద్రం ఆలోచ‌న‌గా ఉన్న‌ట్టు మంత్రి ఠాకూర్ వ్యాఖ్య‌లను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది.  
Tags:    

Similar News