ఇప్పుడు.. 10 నోటు వంతు వ‌చ్చింద‌ట‌

Update: 2018-01-04 09:31 GMT
ఏళ్ల‌కు ఏళ్లుగా కొత్త‌ద‌నం లేని క‌రెన్సీ నోట్ల‌కు న్యూలుక్ ఇచ్చేస్తోంది మోడీ స‌ర్కారు. 2016 న‌వంబ‌రు 8న పెద్ద నోట్ల ర‌ద్దుతో మొద‌లైన ప్ర‌క్రియ‌.. అంత‌కంత‌కూ కొత్త రూపు సంత‌రించుకుంటోంది.  రూ.వెయ్యి.. రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసిన కేంద్ర సర్కారు ఆ వెంట‌నే రూ.2వేల నోటును అమ‌ల్లోకి తీసుకొచ్చింది. కొద్ది రోజుల‌కే న్యూ లుక్ తో రూ.500 నోట్లు మార్కెట్లోకి వ‌చ్చేశాయి.

గ‌తంలో మాదిరి పొడుగ్గా.. వెడ‌ల్పుగా ఉండే నోట్లు కాస్తా.. ఇప్పుడు సైజు మారిపోయాయి. వెయ్యి రూపాయిల నోటుతో పోలిస్తే.. రెండు వేల రూపాయిల నోటు వెడ‌ల్పు త‌క్కువ‌గా ఉండ‌టం తెలిసిందే.  రూ.2వేల నోటు త‌ర్వాత విడుద‌ల చేసిన రూ.500 నోటు గ‌తంతో పోలిస్తే మ‌రింత‌గా చిక్కుకుపోయింది.

ఈ మ‌ధ్య‌నే విడుద‌ల చేసిన రూ.200 నోటు.. రూ.50 నోట్ల సైజు సైతం త‌గ్గిపోయింది. ఇప్పుడు కాస్తంత చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌స్తుతం చెలామ‌ణీలో ఉన్న వంద రూపాయిల నోటు కంటే.. రూ.200 నోటు.. ఆ మాట‌కు వ‌స్తే రూ.500 నోటు చిన్న‌గా ఉన్న ప‌రిస్థితి. దీంతో..రూ.100 నోటును సైతం సంస్క‌రించే ప్ర‌య‌త్నాలు మొద‌లైట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే కొత్త రూ.100 నోట్ల ప్రింటింగ్ పూర్తి అయ్యింద‌ని.. త్వ‌ర‌లోనే చెలామ‌ణీలోకి తెస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌.. మార్పులు చోటు చేసుకునే నోటుగా రూ.10 మారింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం చెలామ‌ణీలో ఉన్న ప‌ది రూపాయిల నోటు చివ‌రిగా 2005లో మార్చారు. న‌కిలీ నోట్ల బెడ‌ద త‌గ్గించ‌టంతో పాటు.. న‌గ‌దు వాడ‌కాన్ని సాధ్య‌మైనంత త‌గ్గించే ప్ర‌య‌త్నంలో భాగంగా నోట్ల చెలామ‌ణిని తగ్గించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఇదిలా ఉంటే.. చిన్న నోట్ల చెలామ‌ణిని పెంచాల‌న్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రూ.10 నోటును మార్చేసేందుకు కేంద్రం ఓకే చెప్పేసిన‌ట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జ‌రిగితే కొత్త రూ.10 నోటు త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ఇప్పుడు ప‌ర్సులో పెట్టుకునే నోట్లు దాదాపు ఒకే వ‌రుస‌లోకి వ‌చ్చేసే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News