ఎర్రబెల్లి వెళ్లింది ‘రూ.60కోట్ల’ ఇష్యూతోనా?

Update: 2016-03-01 10:02 GMT
దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో ఉండి.. కష్టసుఖాల్లో బాబు వెంటే ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్లుండి కారు ఎక్కిపోవటానికి కారణం ఏమిటి? గతంలో ఆయన్ను కారులో ఎక్కించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించినప్పటినీ.. ఆయన్ను వెళ్లకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటిది ఈసారి కారులోకి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు.. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. రేవంత్ రెడ్డికి రోజురోజుకీ పెద్దపీట వేయటం లాంటి మాటలు చాలానే వింటుంటాం.

కానీ.. తాజాగా ఒక ఆసక్తికర వాదన ఒకటి వినిపిస్తోంది. సైకిల్ దిగేసిన ఎర్రబెల్లి కారు ఎక్కేయటానికి అసలు కారణం వేరే ఉందని.. అది రూ.60కోట్ల ఇష్యూ అన్న మాట బలంగా వినిపిస్తోంది. రాజకీయ వర్గాల వాదన ప్రకారం.. ఇటీవల ముగిసిన గ్రేటర్ ఎన్నికల కోసం టీడీపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల ఖర్చుతో పాటు.. ఎన్నికల వ్యవహారానికి అవసరమైన నిధులు దాదాపు రూ.60కోట్లు వచ్చాయని.. ఆ మొత్తాన్ని రేవంత్ కంట్రోల్ లో ఉంచటం ఎర్రబెల్లి అవమానకరంగా భావించారని చెబుతున్నారు.

ఈ భారీ మొత్తాన్ని ఎర్రబెల్లితో పాటు తెలంగాణ పార్టీ బాధ్యులు రమణకు కూడా అవకాశం ఇవ్వలేదని.. మొత్తం లెక్కలు రేవంత్ ను చూడాలని చెప్పారని.. ఇది అవమానకరంగా భావించిన ఎర్రబెల్లి సైకిల్ దిగేసి కారు ఎక్కేసినట్లుగా చెబుతున్నారు. ఎర్రబెల్లిని అవమానించారా? రేవంత్ కు పెద్దపీట వేశారా? అన్న విషయాలతో పాటు.. గ్రేటర్ ఎన్నికల కోసం బాబు అండ్ కో అంత భారీ మొత్తం వినియోగించిందా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఇదంతా నిజమేనా? లేక.. పార్టీ మారేందుకు వీలుగా సృష్టించినా వాదనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News