ముద్దులు 50 మంది ప్రాణాలు తీశాయా?

Update: 2016-06-13 05:13 GMT
అమెరికాలో వణుకు పుట్టించిన ప్లోరిడా ఓర్లాండో పల్స్ పబ్ దుర్మార్గానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. పబ్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 50 మంది ప్రాణాల్ని తీసిన 29 ఏళ్ల మతీన్ ఒమర్ కు స్వలింగ సంపర్కులంటే మా చెడ్డ అసహ్యమట. ఈ మధ్యనే ఒక జంట బహిరంగంగా ముద్దులు పెట్టుకోవటంపై తన తండ్రి దగ్గర విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశాడట. మగవాళ్లకు మగవాళ్లు.. ఆడోళ్లకు ఆడోళ్లు అలా ముద్దులు పెట్టుకోవటం ఏమిటంటూ చిరాకు పడిపోయే మతీన్.. తన అసహ్యానికి తగ్గట్లే స్వలింగ సంపర్కుల పబ్ మీద ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో ఇంతటి దారుణానికి పాల్పడ్డ మతీన్ కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనట్లుగా చెబుతున్నారు. పవిత్రమైన రోజులుగా భావించే రంజాన్ మాసంలోనే గే క్లబ్ మీద లక్ష్యంగా చేసుకున్న తీరు చూస్తే.. ఇది మత సంబధమైన వ్యతిరేకత కంటే కూడా స్వలింగ సంపర్కం మీద ఉన్న వ్యతిరేకతే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాను దారుణానికి పాల్పడటానికి ముందు ‘‘911’’ నంబరుకు ఫోన్ చేసి.. తాను ఐఎస్ మద్దతుగా కాల్పులకు తెగబడనున్నట్లుగా చెప్పినట్లుగా చెబుతున్నారు. అఫ్ఘనిస్థాన్ దంపతులకు జన్మించిన మతీన్ గతంలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేశాడని.. ఇద్దరు మగాళ్లు ముద్దులు పెట్టటాన్ని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అతగాడు ఇంతటి దారుణానికి పాల్పడతాడని తాము అనుకోలేదని అతగాడి తండ్రి వాపోతున్నాడు. అతడి చర్యకు యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిందని.. అతడు ఇంతటి దారుణానికి పాల్పడతాడని తాము అనుకోలేదని.. ఇందుకు తాము క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్ని క్షమాపణలు చెప్పినా.. పోయిన యాభై ప్రాణాలు అయితే తిరిగి రావుగా..?
Tags:    

Similar News