సూదిమందు అంటే కేసీఆర్‌ కు ఎంత భ‌య‌మంటే..?

Update: 2017-07-08 04:44 GMT
త‌న ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి మ‌రీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుప‌రిచితుడు. మ‌రి.. అలాంటి నేత‌కు ఉన్న చిన్న భ‌యం గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవ‌ట‌మే కాదు.. నిజ‌మా అని అవాక్కు కావ‌టం ఖాయం. ఒక చిన్న భ‌యంతోనే తాను చేయించుకోవాల్సిన కంటి శుక్లం ఆప‌రేష‌న్‌ ను ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేసుకుంటున్న వైనాన్ని పార్టీ ఎంపీల‌తో పంచుకున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా పార్టీ ఎంపీల‌తో ఇష్టాగోష్టి సంద‌ర్భంగా.. త‌న‌కున్న సూదిమందు భ‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.

కంటి శుక్లం ఆప‌రేష‌న్‌ కు సూదిమందు అవ‌స‌ర‌మ‌ని.. త‌న‌కేమో సూదిమందు అంటే మ‌హా భ‌య‌మ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో ఆప‌రేష‌న్‌కు ఓకే చెప్పి.. రెండుసార్లు ఢిల్లీకి వెళ్లిన‌ప్ప‌టికీ.. ఆప‌రేష‌న్ చేయించుకోకుండా తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చేయ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌.. కంటి ఆప‌రేష‌న్‌ కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను కూడా చేయించుకున్నారు. ఆప‌రేష‌న్ ముందస్తులో భాగంగా కంట్లో చుక్క‌లు కూడా వేయించుకున్నారు. కానీ.. చివ‌రి నిమిషంలో వాయిదా వేసుకొని హైద‌రాబాద్ వ‌చ్చేశారు. ఆప‌రేష‌న్ చేయించుకుంటే వారం రోజులు రెస్ట్ ఉండాల‌ని.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి హైద‌రాబాద్ వ‌స్తున్న వేళ‌.. ఆయ‌న‌కు స్వాగ‌తం చెప్పాల‌న్న ఉద్దేశంతో సిటీకి తిరిగి వ‌చ్చిన‌ట్లుగా చెబుతారు.

అయితే.. అస‌లు విష‌యం వేరే ఉంద‌ని కేసీఆరే స్వ‌యంగా త‌న ఎంపీల‌కు చెప్పారు. త‌న‌కు సూదిమంది అంటే భ‌య‌మ‌ని.. బిళ్ల‌లు ఎన్ని మింగమ‌న్నా మింగుతాను కానీ సూది (ఇంజెక్ష‌న్‌) వేయించుకోమంటే మాత్రం అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌ని.. అందుకే ఏదో ఒక మాట చెప్పి ఆప‌రేష‌న్ వాయిదా వేస్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పుకురావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తాను చెప్పిన ముచ్చ‌ట‌ను చెప్పొద్ద‌ని.. కుటుంబ స‌భ్యుల‌కు తెలిస్తే ఒత్తిడి చేసి మ‌రీ సూదిమందు వేయించి ఆప‌రేష‌న్ చేయిస్తార‌ని చెప్ప‌టం ఎంపీల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. సూదిమందుకు చిన్న‌పిల్ల‌లుకూడా భ‌య‌ట‌ప‌డ‌టం లేదు క‌దా? అని ప్ర‌శ్నించిన ఎంపీల‌తో.. గ‌ట్టిగా అన‌మాకండ‌య్యా.. ఈ విష‌యం ఇంట్లో తెలిస్తే.. బ‌ల‌వంతంగా అయినా ఆప‌రేష‌న్ చేయిస్తార‌ని చెప్ప‌టంతో అంద‌రూ న‌వ్వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అంత పెద్ద కేసీఆర్‌కు ఇంత చిన్న సూది అంటే అంత అయిష్ట‌మా?
Tags:    

Similar News