మురళీ మోహన్ మౌనం.. కారణమదేనా?

Update: 2019-09-07 08:49 GMT
2019 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు సహా అందరూ నమ్మినా.. నమ్మని వ్యక్తుల్లో ఒకే ఒక్కరు మురళీ మోహన్. 2014 ఎంపీ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి  గెలిచిన మురళీ మోహన్ ఎంపీగా కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు ఆర్థిక అండదండలు అందించే వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరిని చెబుతుంటారు.

అయితే 2019 ఎంపీ ఎన్నికల్లో మురళీమోహన్ ను రాజమండ్రిలో మరోసారి పోటీచేయాలని చంద్రబాబు కోరారు. కానీ మురళీ మోహన్ ససేమిరా అన్నారు. తాను గెలవనని.. టీడీపీ కూడా అధికారంలోకి రాదని ఆయన బలంగా నమ్మారు కనుకే పోటీచేయలేదని గుసగుసలు వినిపించాయి. ఇక చంద్రబాబు బలవంత పెట్టడంతో ఆయన కోడలు రూపను బరిలోకి దింపారట..

ఎంపి ఎన్నికల్లో మురళీ మోహన్ కోడలు రూప కూడా వైసీపీ గాలిలో కొట్టుకుపోయారు. వైసీపీ కొత్త అభ్యర్థి భరత్ చేతిలో చిత్తుగా ఓడారు. అప్పటి నుంచి మురళీ మోహన్ గానీ, ఆయన కోడలు రూప కానీ అసలు రాజమండ్రిలో కనిపించడంలేదట.. ఇప్పటివరకు అడుగు కూడా పెట్టలేదట.. వారు పూర్తిగా రాజమండ్రికి దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

నిజానికి చంద్రబాబు కోరిక మేరకు అమరావతిలో మురళీ మోహన్ పెట్టుబడి పెట్టారని సమాచారం.. ఆయన.ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరికి అమరావతిలో కొన్ని కీలక ప్రాజెక్టులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఘనంగా గెలిచిన వేళ మళ్లీ రాజకీయం చేస్తే అమరావతిలోని ప్రాజెక్టులకు రిస్క్ అనే  కోణంలోనే మురళీ మోహన్ మౌనంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఎందుకొచ్చిన గొడవలనే రాజకీయాలకు మురళీ మోహన్ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News