ప‌రిటాల ఇంటి పెళ్లికి లోకేశ్ ఎందుకు వెళ్ల‌న‌ట్లు?

Update: 2017-10-03 07:44 GMT
అనంత‌పురం జిల్లాలోని ఓప‌క్క‌న జ‌రిగిన ప‌రిటాల శ్రీరామ్ పెళ్లి వేడుక‌కు.. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి కూడా ప్ర‌ముఖులు రావ‌టం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఏపీ నేత ఇంట పెళ్లి జ‌రిగినా ఏపీకి రాని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ప్ర‌త్యేకంగా హెలికాఫ్ట‌ర్ లో రావ‌టం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే.

దాదాపు మూడున్న‌ర ల‌క్ష‌ల మంది వ‌ర‌కూ అతిధులు పెళ్లికి హాజ‌రైన‌ట్లుగా లెక్క‌లు చెబుతున్నారు. వేడుక‌లు ఎంత భారీగా జ‌రిగాయ‌న్న విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. ప‌రిటాల ఇంట జ‌రిగిన పెళ్లికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ మంత్రి నారా లోకేశ్ గైర్హాజ‌రు కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

యువ‌కుడు.. ప‌రిటాల ఇంట రాజ‌కీయ వార‌సుడైన శ్రీరామ్ పెళ్లికి చిన‌బాబు ఎందుకు వెళ్ల‌లేద‌న్న‌ది పార్టీ లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ భ‌విష్య నేత‌గా అభివ‌ర్ణించే లోకేశ్‌.. పార్టీలో యువ‌నాయ‌క‌త్వానికి అండ‌గా ఉంటార‌న్న మాట వినిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా శ్రీరామ్ పెళ్లికి వెళ్ల‌కపోవ‌టం చూస్తే.. ఆయ‌న‌తో చిన‌బాబుకు పెద్ద‌గా పొస‌గ‌ద‌న్న మాట‌లో నిజం ఉందా? అన్నది ప్ర‌శ్న‌గా మారింది.

తెలుగుదేశం పార్టీలో ప‌రిటాల ఫ్యామిలీకి ఉన్న ప్ర‌యారిటీని త‌క్కువ చేయ‌లేం. మ‌రి.. ఇంత ముఖ్య‌మైన కుటుంబంలో జ‌రుగుతున్న పెళ్లికి లోకేశ్ ఎందుకు హాజ‌రు కాక‌పోవ‌టం అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం వెతికితే.. లోకేశ్ కు ప‌రిటాల శ్రీరామ్‌ కు మ‌ధ్య అంత చ‌క్క‌టి సంబంధాలు లేవ‌న్న మాట వినిపిస్తోంది. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొట్టిపాటి ర‌వికుమార్‌ ను క‌ర‌ణం బ‌ల‌రాంకు పోటీగా తీసుకురావ‌టంతో చిన‌బాబుకు ప‌రిటాల శ్రీరామ్‌ కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌ని.. అది రోజురోజుకి పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌లేద‌న్న అభిప్రాయం ఉంది.

పెళ్లికి వెళ్ల‌టం ద్వారా ఆ గ్యాప్ త‌గ్గించేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌ర్ లో ఉన్న వేళ పెళ్లికి వెళితే.. ఒక అడుగు వెన‌క్కి వేసిన‌ట్లుగా ఉంటుంద‌న్న మాట‌కు విలువ‌నిచ్చే లోకేశ్ బాబు పెళ్లికి వెళ్ల‌లేద‌న్న మాట కొంద‌రి నేత‌ల నోట వినిపిస్తోంది. ఫ్యూచ‌ర్ అధినేత‌గా అంద‌రిని క‌లుపుకుపోవ‌టం.. బ‌ల‌మైన ప్ర‌జామ‌ద్ద‌తు ఉన్న ఫ్యామిలీతో స‌న్నిహిత సంబంధాలు నెర‌ప‌టం చాలా అవ‌స‌రం. ఇందుకు భిన్నంగా లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. న‌చ్చినా..న‌చ్చ‌కున్నా పార్టీ అధినేత‌గా ఉన్న త‌న తండ్రి చంద్ర‌బాబు కొంద‌రి విష‌యంలో రాజీ ప‌డిన తీరు లోకేశ్ లో క‌నిపించ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఈ తీరు ఎంత త్వ‌ర‌గా మార్చుకుంటే అంత మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అదే ఉంటే ఇప్పుడిలా మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదేమో?
Tags:    

Similar News