అందుకే.. పిడమర్తి రవి పెళ్లి వాయిదా

Update: 2016-12-18 05:12 GMT
వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమని చెబుతున్నారు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమ సమయంలో తనదైన మాటలతో.. సంచలన వ్యాఖ్యలతో తరచూ మీడియాలో దర్శనమిచ్చిన పిడమర్తి రవి తెలుగువారికి సుపరిచితులు. ఉస్మానియా విద్యార్థి నాయకుడుగా అతడు చేసిన ఉద్యమ పోరాటానికి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగించారు.

అవివాహితుడైన పిడమర్తి రవి తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర ముచ్చట చెప్పుకొచ్చారు. తన పెళ్లి వాయిదా పడిన విషయాన్ని చెప్పిన రవి.. పెద్దనోట్ల రద్దు కారణంగానే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సామాన్యులపై బాగా ఉందని.. అందులో భాగంగానే తన పెళ్లి కూడా వాయిదా పడినట్లుగా వెల్లడించారు.

ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి పెళ్లి.. నోట్ల రద్దు కారణంగా వాయిదా పడటం నమ్మశక్యంగా లేదంటూ మీడియా ప్రతినిధులు పిడమర్తిరవితో అన్నప్పుడు ఆయన బదులిస్తూ.. ‘‘నిజంగానే పెళ్లి రద్దు కావటానికి కారణం నోట్ల రద్దే. పెళ్లి భోజనం పెట్టటానికైనా డబ్బులు పుట్టని పరిస్థితి. ఖర్చులకు డబ్బుల్లేకుండా పెళ్లి ఎలా చేసుకోను?’’ అంటూ ప్రశ్నించిన పిడమర్తి రవి మాటలు వింటే.. ప్రముఖుల మీద కూడా నోట్ల రద్దు నిర్ణయం ఇంత ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News