అతడ్ని ఆ మాట అన్నందుకే స్వాతిని చంపేశాడట

Update: 2016-07-04 06:02 GMT
చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా ఐటీ ఎంప్లాయ్ స్వాతిని కొబ్బరిబోండాం కత్తితో చంపిన రామ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడ్ని విచారిస్తున్న అధికారులకు..స్వాతిని తానెందుకు చంపానన్న విషయాన్ని వివరించినట్లుగా చెబుతున్నారు.అంతేకాదు.. స్వాతితో తనకెలా పరిచయం అయ్యిందన్న విషయాన్ని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

రామ్ కుమార్ పోలీసులకు చెప్పినట్లుగా భావిస్తున్న వివరాల్ని చూస్తే..

ఎక్కడ చెన్నై..? ఎక్కడ తిరునెల్వేలి? ఈ రెండింటి మధ్య దూరం చాలానే ఎక్కువ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే దాదాపు 600 కిలోమీటర్ల దూరం. అలాంటిది రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరికి పరిచయం ఎక్కడ జరిగింది?ఎలా జరిగింది? స్వాతి ఉండే ఇంటికి సమీపంలోనే అతడు ఎందుకు నివాసం ఉంటున్నాడు? అన్న విషయాల్లోకి వెళితే అసలు విషయం బయటకు వచ్చింది.తిరునెల్వేలిలో ఉండే రామ్ కుమార్ కు చెన్నైలో ఉండే స్వాతికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆమె కోసమే తాను చెన్నై వచ్చినట్లుగా రామ్ కుమార్ చెబుతున్నాడు.

ఆమె ప్రేమను పొందేందుకు చెన్నై వచ్చి.. ఆమె నివాసం దగ్గర్లో ఇంటిని తీసుకున్నాడు. అలా అయితే.. తాను ప్రేమించిన స్వాతిని రోజూ చూడొచ్చు..కలవొచ్చన్నది అతడి ఉద్దేశం. రామ్ కుమార్ ప్రయత్నించినా.. స్వాతి మాత్రం అతడ్ని తిరస్కరించింది. తాను ఎంత వెంట పడినా ఆమె నో చెప్పటం.. అదే సమయంలో ఆమె ఎవరికి ఈ విషయాన్ని చెప్పకపోవటంతో తన మీద ఎంతోకొంత ప్రేమ ఉండటం వల్లనే ఆమె అలా వ్యవహరిస్తుందని తాను భావించినట్లుగా రామ్ కుమార్ చెబుతున్నాడు.

తనను రిజెక్ట్ చేయటంతో పాటు.. పదే పదే తనను మాటలతో అవమానించేదని.. తనను కొండముచ్చు అని హేళనగా మాట్లాడటమే తనలోని రాక్షసుడు నిద్ర లేచినట్లుగా రామ్ కుమార్ చెప్పుకొచ్చాడు. మీనాక్షిపురం సమీపంలోని ఒక తోటలో అరటి గెలలు కోయటానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకొని చెన్నైకి చేరుకున్నాడు. తనకు స్వాతిని హత్య చేయాలన్న ఆలోచన లేదని.. ఆమెను ఒత్తిడి తీసుకురావాలన్నదే తన ఉద్దేశంగా చెప్పాడు. అయితే..హేళన చేస్తూ స్వాతి మాట్లాడిన మాటలే తనను ఉన్మాదిగా మార్చినట్లుగా ప్రేమ్ కుమార్ చెబుతున్నాడు. రామ్ కుమార్ చెప్పిన అంశాల్లో ఒక అంశం దగ్గర కొంత సందేహం కలుగుతుంది. అదేమంటే.. రామ్ కుమార్ తనను ఇంత ఇబ్బంది పెట్టినా ఆమె ఎందుకు పెదవి విప్పలేదు అని? దీనికి స్వాతి స్నేహితుడు సిద్ధిక్ మాటల్లో చెప్పాలంటే..స్వాతిది స్వతంత్ర్యంగా ఆలోచించే వ్యక్తిత్వం. తన మీద తనకు నమ్మకం ఎక్కువ. ఎలాంటి పరిస్థితినైనా తాను హ్యాండిల్ చేయగలనన్ననమ్మకం. సమస్య ఏదైనా తానే డీల్ చేస్తానన్న ధైర్యం. అందుకే తనకు సంబంధించిన ఇష్యూను తానే పరిష్కరించుకోవాలని అనుకుంది.అందుకే.. ఆ విషయాల్ని ఎవరికి చెప్పలేదు. కానీ.. అదే ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగిసేలా చేసిందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News