సీఎం సొంత జిల్లాలో రె‘బెల్స్’

Update: 2021-03-03 02:30 GMT
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ బెడద తీవ్రమైంది. జగన్ సొంత జిల్లా కావడంతో ఇతర పార్టీల నేతలందరూ వైసీపీలోకి చేరిపోయారు. దీంతో ఇప్పుడు టికెట్లు పంచడం తలనొప్పిగా మారింది. దక్కని వారు రెబెల్ గా పోటీచేసేందుకు దిగుతుండడంతో పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

బద్వేలు మున్సిపాలిటీలో అధికార పార్టీ నుంచే ఎక్కువమంది నామినేషన్లు వేశారు. బీ-ఫామ్ ఇవ్వకపోయినా సరే స్వతంత్రులుగా బరిలో ఉంటామని అభ్యర్థులు తేల్చిచెబుతున్నారు.

బద్వేలు మున్సిపాలిటీకి మూడో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 35 వార్డులు ఉండగా.. 90మంది వైసీపీ తరుఫున నామినేషన్లు వేశారు. ఆ తర్వాత 35మంది వైసీపీ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విడుదల చేశాడు. మిగిలిన వారు తప్పుకోవాల్సి ఉన్నా పార్టీ నిర్ణయం నచ్చక చాలా మంది రెబల్స్ గా బరిలో ఉన్నారు.

నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో  రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఎవ్వరూ పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నట్లు వైసీపీలో చర్చ సాగుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటున్నా ధిక్కరణ ధోరణిలోనే ఉన్నట్లు సమాచారం.

అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి చైర్మన్ పదవిని ఎలా కట్టబెడుతారని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇక్కడ వైసీపీకి గెలుపు కష్టంగా మారింది.
Tags:    

Similar News