మోడీ ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెబితే.. చైనాకు కోపమొచ్చింది

Update: 2022-07-08 03:22 GMT
తనకు నచ్చని పని ఏదీ జరగకూడదన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది డ్రాగన్ దేశం. తాను గీసిన గీతలోనే తన చుట్టుపక్కల దేశాల వారు నడవాలని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు తమకు నచ్చని పనిని అస్సలు చేయకూడదన్నట్లుగా వ్యవహరించే తీరు చైనాలో ఈ మధ్యన మరింత పెరుగుతోంది.

చిన్న విషయాల్ని సైతం పెద్దగా చేసి చూడటం.. తమకు నచ్చని ప్రతి అంశంలోనూ ఎగిరెగిరిపడటం.. విమర్శల్ని సంధించటం లాంటివి ఎక్కువ చేస్తోందీ దేశం. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధాని మోడీ వ్యవహరించిన తీరుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై భారత సర్కారు కాసింత ఘాటుగానే రియాక్టు అయ్యింది.

ఇంతకూ చైనా సర్కారుకు కాలేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చేశారన్న విషయంలోకి వెళితే.. తాజాగా ప్రముఖ అధ్యాత్మిక గురువు దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేసి.. బర్త్ డే విషెస్ చెప్పారు.

దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. విమర్శలు చేసింది. టిబెట్ సంబంధిత అంశాల ద్వారా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ ఆరోపిస్తూ.. ప్రధాని మోడీ తీరును తప్పు పట్టింది.

దలైలామా అనుసరిస్తున్న చైనా వ్యతిరేక వైఖరిని భారత్ పూర్తిస్థాయిలో గుర్తించాలని కోరిన చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై భారత్ ధీటుగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది కూడా దలైలామా పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేయటంతో పాటు.. ఆయన భారత్ కు గౌరవ అతిధి అన్న విషయాన్ని స్పష్టం చేసింది.

టిబెట్ అంశం చైనా అంతర్గత విషయమని.. విదేశీ జోక్యం పనికి రాదంటూ చైనా మంత్రి వ్యాఖ్యానిస్తూ.. దలైలామాతో ఏ దేశమైనా బంధం నెరపటానికి తాము వ్యతిరేకమన్న చైనా వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడిన వైనాన్ని సమర్థించటంతో పాటు.. ఆ అంశాన్ని తప్పుగా చూడటాన్ని కాస్తంత గట్టిగానే ప్రశ్నించిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News