షాకింగ్ నిర్ణయం.. లక్ష మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న అమెజాన్

Update: 2022-08-01 04:12 GMT
ఊహించని ఉపద్రవంలా ప్రపంచం మీద పడిన కరోనా దెబ్బకు గింగిరాలు తిరిగిన ప్రజలు.. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా షాక్ నుంచి బయటకు వచ్చామా? అన్నంతలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ పుణ్యమా అని.. ప్రపంచం నెత్తిన ఉక్రెయిన్ తో యుద్ధాన్ని పెట్టిన అతగాడి దెబ్బకు పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయి.

దీనికి తోడు అగ్రరాజ్యం అమెరికాలో మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని.. త్వరలో గడ్డు పరిస్థితులు గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ప్రపంచ వ్యాప్తంగా పలు పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఆ మాటకు వస్తే ఇప్పటికే మాంద్యం చీకట్లు మొదలైనట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న మూడు నెలల్లో అమెరికా మాంద్యం తాలుకూ ఎఫెక్టు ప్రపంచం మీద పడటం ఖాయమన్న అంచనా వేస్తున్నారు.

ఇలాంటివేళలో షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఈ కామర్స్ దిగ్గజంగా పేరున్న అమెజాన్.. తన సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో లక్ష మందిని తొలగిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా లక్ష మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించే కార్యక్రమం షురూ అయ్యింది.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని.. లక్ష మందిపై వేటు పడినట్లుగా చెబుతున్నారు. అమెరికా వార్షిక ఫలితాల్ని వెల్లడించే నేపథ్యంలో ఆ సంస్థ సీఈవోగా వ్యవహరిస్తున్న బ్రియాన్ ఒల్సావ్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలో మొత్తం 15 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో లక్ష మందిని తొలగించినట్లుగా పేర్కొన్నారు. సిబ్బందిని తగ్గించటంతో పాటు వారిని నియమించుకోవటాన్ని కూడా తగ్గిస్తే మంచిదని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

గత ఏడాది ఇదే అమెజాన్ 27 వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. అయితే.. ఒమిక్రాన్ విరుచుకుపడిన సందర్భంలో తమ సంస్థ కార్యకలాపాల్ని ముమ్మరం చేసే పనిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని నియమించింది. తనకు అవసరమైనప్పుడు అందుకు తగ్గట్లుగా ఉద్యోగుల్ని చేర్చుకునే సంస్థ.. తన అవసరం తీరినా.. అవసరం లేదనిపించినా నిర్మోహమాటంగా ఉద్యోగుల్ని తొలగించే విషయంలో అమెజాన్ కచ్ఛితంగా వ్యవహరిస్తుందన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యిందనే చెప్పాలి.
Tags:    

Similar News