'రిజ‌ర్వ్‌' పోటెత్తింది!... జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మే!

Update: 2019-04-27 14:30 GMT
ఏపీ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గెలుపు ఖాయ‌మేనన్న వాద‌న అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఈ నెల 11న జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిని చూస్తే... ఇదే విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఈ లెక్క‌ల అంచ‌నాతోనే జ‌గ‌న్ కూడా గెలుపు ధీమాతో ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ దిశగా ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చిన మ‌రో ఆస‌క్తిక‌ర అంశం జ‌గ‌న్ గెలుపును మ‌రింత‌గా ఖ‌రారు చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో.

ఈ నెల 11న జ‌రిగిన పోలింగ్ లో రాష్ట్రంలోని ఎస్సీ రిజ‌ర్వ్‌ డ్ సీట్ల‌తో పాటు ఎస్టీ రిజ‌ర్వ్ డ్ సీట్ల‌లో భారీ ఎత్తున పోలింగ్ ప‌ర్సంటేజీ పెరిగింది. జ‌న‌ర‌ల్ స్థానాల్లో కంటే రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌కు జ‌రిగిన పోలింగ్ లో భారీ ఎత్తున పెరుగుద‌ల క‌నిపించింది. గ‌డ‌చిన ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని ఎస్సీ - ఎస్టీ రిజ‌ర్వ్ డ్ సీట్ల‌లో మెజారిటీ సీట్ల‌ను వైసీపీ గెలిచిన విష‌యం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో మొత్తం సీట్లు 175 కాగా... వాటిలో 29 సీట్లు ఎస్సీ రిజర్వ్‌ డ్ కాగా - 7 సీట్లు ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ సీట్లు. ఈ లెక్క‌న ఎస్సీ - ఎస్టీ రిజ‌ర్వ్‌ డ్ సీట్ల సంఖ్య ఏకంగా 36కు చేరుతుంది. ఈ సీట్ల‌న్నింటిలో మొన్న‌టి పోలింగ్ లో పెరిగిన ఓటింగ్ శాతాన్ని బ‌ట్టి చూస్తే... ఆ సీట్ల‌న్నీ కూడా వైసీపీ ఖాతాలో ప‌డిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

దివంగ‌త సీఎం - వైఎస్ జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 2009 నుంచి కూడా రిజ‌ర్వ్‌ డ్ స్థానాల్లో భారీ ఎత్తున పోలింగ్ న‌మోదవుతోంది. 2009లో ఎస్టీ రిజ‌ర్వ్ డ్ సీట్ట‌కు 69 శాతం పోలింగ్ న‌మోదు కాగా... అదే 2014కు వ‌చ్చేస‌రికి ఈ స్థానాల పోలింగ్ శాతం 73కు చేరిపోయింది. ఇక మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఎస్టీ రిజ‌ర్వ్ డ్ స్థానాల్లో 75.38 శాతం పోలింగ్ న‌మోదైంది. అదే స‌మ‌యంలో ఎస్సీ రిజ‌ర్వ్‌ డ్ సీట్ల‌లోనూ ఇతే త‌ర‌హాలో 2009లో 78.76 శాతం పోలింగ్ న‌మోదు కాగా... 2014లో ఆ శాతం ఏకంగా 81.51కి చేరింది. ఇక మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఎస్సీ రిజ‌ర్వ్‌ డ్ సీట్ల‌లో పోలింగ్ కేంద్రాల‌కు జ‌నం పోటెత్తారు. ఈ ద‌ఫా ఈ స్థానాల్లో అత్య‌ధికంగా 83.09 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక జ‌న‌ర‌ల్ సీట్ల‌కు కూడా పోలింగ్ శాతం పెరుగుతూనే వ‌స్తున్నా... రిజ‌ర్వ్‌ డ్ స్థానాల్లో న‌మోదైన మేర భారీ పోలింగ్ క‌నిపించ‌లేదు. ఓవ‌రాల్ గా జ‌న‌ర‌ల్ స్థానాల‌కు ఈ ద‌ఫా 79.12 శాతం పోలింగ్ న‌మోదైంది.

సాధార‌ణంగా ఎస్సీ ఎస్టీలంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత ఎస్సీలు మ‌రింత‌గా కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర‌య్యారు. వైఎస్ అకాల మ‌ర‌ణంతో కాంగ్రెస్ లో ఇమ‌డ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చేసిన జ‌గ‌న్ వెన్నంటి న‌డుస్తున్న ఈ వ‌ర్గాలు... ఈ సారి ఎలాగైనా జ‌గ‌న్ ను సీఎం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో పోలింగ్ కేంద్రాల‌కు బారులు తీరిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో సంక్షేమంలో తామెంతో చేశామ‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకు ఈ స్థానాల్లో పెరిగిన పోలింగ్ పెద్ద దెబ్బ కొట్టేయ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News