ఎర్రకోటకు రక్షణ వ్యవస్ధ

Update: 2021-08-08 05:54 GMT
మొన్న జనవరిలో ఎదురైన అనుభవంతో కేంద్రప్రభుత్వం ఎర్రకోటకు రక్షణ వ్యవస్ధను ఏర్పాటుచేసింది. షిప్పింగ్ కంటైనర్లను తెప్పించి ఎర్రకోట ప్రధాన ద్వారం ముందు రక్షణగా ఏర్పాటుచేసింది.  మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి ఛలో ఢిల్లీ కార్యక్రమంలో రైతుల్లో కొందరు హఠత్తాగా ఎర్రకోట మీదకు ఎక్కిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఎర్రకోట మీదుండే జాతీయ జెండా దగ్గరకు చేరుకుని మరో జెండాను ఎగరేయటం అప్పట్లో దేశంలో సంచలనం రేపింది. ఈ ఘటన అంతర్జాతీయ మీడియా  కూడా చాలా ప్రముఖంగా ప్రసారం చేసింది. ఎందుకంటే జనవరి 26, ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుండే రాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగాలు చేసే చోటన్న విషయం అందరికీ తెలిసిందే.

తొందరలో ఆగస్టు 15వ తేదీ రాబోతోంది. ప్రధానమంత్రి ప్రసంగానికి ఎర్రకోట సిద్ధమవుతోంది. జనవరి 26వ తేదీ అనుభవాన్ని దృష్టిలో ఉంచేకునే ఎవరు కూడా ఎర్రకోట ప్రధాన ద్వారం దగ్గరకు రాకుండా భద్రతాధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే భారీ షిప్పింగ్ కంటైనర్లను తెప్పించారు. వీటిని ప్రధాన ద్వారం దగ్గర భద్రతగా ఏర్పాటుచేశారు. వీటిని అలాగే వదిలేయకుండా అలంకరిస్తున్నారు. చాందినీచౌక్ నుండి ఎర్రకోటలోపల ప్రాంతాన్ని ఎవరూ చూడకుండా ఈ కంటైనర్లను ఏర్పాటు చేసినట్లు భద్రతాధికారులు చెప్పారు.

ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగరేసటపుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రసంగించేటపుడు రైతులు అటువైపు వచ్చే అవకాశం ఉందని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి.  అందుకనే ఎర్రకోటకు చాలా దూరం నుండే పోలీసులు, మిలిట్రీ అధికారులు మూడంచెల భద్రతా వ్యవస్ధను ఏర్పాటుచేశారు. ముందుజాగ్రత్తగా డ్రోన్లతో ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. మొత్తానికి జనవరి 26 ఘటనతో భద్రతాధికారులు మేల్కొన్నట్లే కనిపిస్తోంది.
Tags:    

Similar News