ఒకే రోజు వెంకట్రామిరెడ్డికి ఒక తీపి.. మరో చేదు కబురు

Update: 2021-11-24 05:35 GMT
తెలంగాణ రాష్ట్రంలో బోలెడంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత విధేయుడిగా.. ఆయన ప్రాతినిధ్యం వహించే జిల్లాకు కలెక్టర్ గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి (ఇటీవల తన పదవికి రాజీనామా చేశారనుకోండి) పేరు తరచూ వార్తల్లోకి రావటం తెలిసిందే.

ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే ఆయన..కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారటం తెలిసిందే. హైకోర్టు.. సుప్రీంకోర్టులు ఆదేశించినా వరి విత్తనాల్ని అమ్మే షాపుల్ని తెరిచేందుకు అనుమతి ఇవ్వనంటే ఇవ్వనని తేల్చేసిన ఆయన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

సిద్ధిపేట జిల్లా మాజీ కలెకర్టర్ గా ఉన్న ఆయన.. గతంలో తాను కలెక్టర్ గా వ్యవహరించే వేళలో చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్ గా ఉన్న వేళ వెంట్రామిరెడ్డి వ్యాఖ్యలను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో.. హైకోర్టు సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ కింద విచారణను స్వీకరించాయి.

సుప్రీం.. హైకోర్టులు ఆదేశించినా వరి విత్తనాల్ని అమ్మేందుకుషాపులను తాను అనుమతించనని చెప్పిన వెంకట్రామిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. యాసంగిలో ఒక్క కిలో వరి విత్తనాల్ని అమ్మటానికి వీల్లేదన్న ఆయన.. అలా చేసిన షాపుల్ని సీజ్ చేస్తామని... కోర్టులు ఆదేశించినా షాపుల్ని తెరిచేందుకు అనుమతులు ఇవ్వనన్న ఆయన వ్యాఖ్యలపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయస్థానానికి వెంకట్రామిరెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.అయితే.. రాజ్యాంగ ధర్మాసనాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వెంకట్రామిరరెడ్డిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించాల్సిందేనని కాంగ్రెస్ నేత నర్సారెడ్డి కోరుతున్నారు. మరి.. కోర్టు ఇచ్చిన నోటీసులకు వెంకట్రామిరెడ్డి ఎలాంటి సమాధానాన్ని ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో తాను అన్న మాటల విషయంలో ఎదురుదెబ్బ తిన్న ఆయనకు మరో సాంత్వన లభించింది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే విషయంలో వెంకట్రామిరెడ్డిని అనుమతించకూడదని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నిక ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో.. ఐఏఎస్ అధికారిగా రాజీనామా ఆమోదంపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని పేర్కొంటూ.. నామినేషన్ దాఖలుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇలా ఒక ఎదురుదెబ్బ.. మరో సాంత్వన ఒకే రోజులో ఎదురుకావటం గమనార్హం.


Tags:    

Similar News