అదాని గ్రూప్​ ప్రతినిధులు విశాఖకు ఎందుకొచ్చారు?

Update: 2021-03-18 04:16 GMT
విశాఖ స్టీల్​ ప్లాంట్​కు ప్రైవేట్ పరం చేయబోతున్నామంటూ కేంద్రం ప్రకటించగానే.. విశాఖ వాసులకు కడుపు మండిపోయింది. ఒక్క విశాఖలోనే కాక.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగాయి. విశాఖ ఉద్యోగసంఘాల జేఏసీకి సాధారణ, ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. అధికార వైసీసీతో పాటు ప్రధాన ప్రతి పక్షమైన టీడీపీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. ఇక ఏపీ బీజేపీ, జనసేన మాత్రం విధిలోనే పరిస్థితుల్లో గమ్మున ఉండి పోయాయి. ఇదిలా ఉంటే దాదాపు 34 రోజులగా అక్కడ ఉద్యమం సాగుతూనే ఉంది. టీడీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పై విమర్శలు చేసే ధైర్యం లేక .. అధికార వైసీపీపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నది. టీడీపీ విమర్శలను కూడా వైసీపీ తిప్పి కొడుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్టణంలో అదాని గ్రూప్​ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నిజానికి అదాని   గ్రూప్​ సంస్థ.. విశాఖ స్టీల్​ ప్లాంట్​ను దక్కించుకోబోతున్నదంటూ వార్తలు వచ్చాయి. కేంద్రం ప్రభుత్వం ఈ సంస్థకు విశాఖను అప్పగించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదాని గ్రూప్​ సంస్థ ప్రతినిధులు విశాఖలో కనిపించారు. ఇక్కడ ఉద్యమం ఎలా జరుగుతుంది. శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంది? ఒక వేళ విశాఖ స్టీల్​ ప్లాంట్​ ను కొనుగోలు చేస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటి? తదితర విషయాలపై వాళ్లు ఆరా తీసినట్టు సమాచారం.

విశాఖలోని శాంతి భద్రతల పరిస్థితిపై పోలీసులను కూడా అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. అదాని ప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే విశాఖలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అదాని గ్రూప్​ సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్​ పరం చేయబోతున్నది. అందులో భాగంగా విశాఖ స్టీల్​ కూడా ప్రైవేట్ పరం కాబోతున్నది. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమను ఆంధ్రప్రదేశ్​ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నారు. అటువంటి సంస్థ ప్రైవేట్​ పరం కాబోతుండటంతో ఈ అంశం సెంటిమెంట్​గా మారింది. దీంతో విశాఖపట్టణంలో తారస్థాయిలో ఉద్యమం సాగుతున్నది. ఈ ఉద్యమం ఎఫెక్ట్​తో ఇటీవల జరిగిన మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.
Tags:    

Similar News