కోటయ్య మాష్టారి మరణంపై తెలుగు మీడియా శునకానందం

Update: 2021-06-01 03:30 GMT
వ్యవస్థల్లోనూ.. వ్యక్తుల్లోనూ వస్తున్న మార్పులకు నిదర్శనంగా నిలుస్తుంది కోటయ్య మాష్టారి మరణం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు. ప్రపంచంలో ఏ అభిప్రాయాన్ని.. ఏ ఒక్కరికి అందరి ఆమోదం లభించదు. కొందరు సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తారు. ఇదంతా మామూలుగా జరిగేదే. ఆనందయ్య మందుపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. ఆయన్ను.. ఆయన మందును సమర్థించేవారు ఒక వర్గంగా.. ఆయన్ను ఆయన మందును తీవ్రంగా తప్పుపట్టే వారు మరో వర్గంగా మారటం తెలిసిందే. ఈ రెండు వర్గాల మధ్య హాట్ హాట్ వాదనలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇందులోకి మీడియా దూరటమే అభ్యంతరకరం.

తామరాకు మీద నీటి బొట్టులా ఉండాల్సిన మీడియా ఇప్పుడు అందుకు భిన్నంగా ఉండటం తెలిసిందే.రాజకీయ రచ్చను కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే.. అందులోని వెళితే.. ఒకపట్టాన బయటకు రాలేం. ఆనందయ్య లాంటి వారి ఎపిసోడ్ లు వచ్చినప్పుడు.. సామాన్యుల మాదిరి.. విచారణకు ముందే తీర్పు ఇచ్చేయకుండా కాస్త ఓర్పును ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

ఆనందయ్య విషయంలో అలా జరగలేదు. ఆయన ఒప్పుల్ని చూపించేందుకు కొన్ని మీడియా సంస్థలు ఏ మాత్రం ఇష్టపడలేదు. తమకున్న ఫీలింగ్స్ ను ఎప్పటికప్పుడు బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే కోటయ్య మాష్టారి వీడియో బయటకు వచ్చింది. అప్పటివరకు కరోనాతో బాధ పడిన తాను.. కోటయ్య మందు వేసుకున్న నిమిషాల్లోనే తనకు పూర్తిగా నయమైనట్లుగా ఆయన వీడియోలో చెప్పారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఇది జరిగిన కొద్ది రోజులకు కోటయ్య మాష్టారి ఆరోగ్యం విషమించటంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. మేం చెప్పామా? ఆనందయ్య మందు మంచిది కాదని.. ఇప్పుడు చూశారా కోటయ్య మాష్టారి సంగతి ఏమైందన్న అర్థం వచ్చేలా వార్తల్ని తెగ వండేశారు.  క్షీణించిన ఆరోగ్యంతో ఉన్న కోటయ్య మాష్టారి వీడియోల్ని తెగ ప్రసారం చేసి తమకున్న శునకానందాన్ని చాటి చెప్పారు.

మొదట్నించి చెబుతున్నట్లుగా మేం ఆనందయ్య మందును వ్యతిరేకించటం లేదు అలా అని సమర్థించటం లేదు. జరుగుతున్నది జరుగుతున్నట్లుగా చెప్పటమే మా విధి. కోటయ్య మాష్టారి ఉదాహరణతో ఆనందయ్యను టార్గెట్ చేసేందుకు వెనుకాడని వారి తీరును పలువురు తప్పు పడుతున్నారు. ‘‘కోటయ్య మాష్టారి ఉదంతాన్ని చూపించి ఆనందయ్యను బద్నాం చేస్తున్నారు సరే.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిత్యం చనిపోయే పేషంట్ల మాటేమిటి? శాస్త్ర సమ్మతమైన వైద్యాన్ని చేస్తున్నప్పుడు కూడా ఇంత భారీగా మరణించటాన్ని కూడా దారుణాలుగా చూపించరేం?’’ అంటూ మండిపడుతున్నారు.

కోటయ్య మాష్టారి మరణం కేవలం ఆనందయ్య మందు మాత్రమే కారణం అవుతుందని ఎలా చెబుతారు? అందుకు ఉన్న సాక్ష్యం ఏమిటి? లాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. వీటికి బదులివ్వటం మానేసి.. తాము తీసుకున్న స్టాండ్ ను అదే పనిగా ప్రదర్శిస్తూ శునకానందం పొందుతున్నచానళ్లను సామాన్యులు తిట్టిపోస్తున్నారన్న విషయాన్ని ఆ చానళ్లు ఎప్పటికి గుర్తిస్తాయో?
Tags:    

Similar News