బ్యాంక్ దగ్గర నాటి సైనికుడి రోదన

Update: 2016-12-17 10:29 GMT
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించిన ప్రకటన దేశ వ్యాప్తంగా ఎంతటి కలకలాన్ని రేపిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవటానికి.. బ్యాంకుల వద్దా.. ఏటీఎం క్యూల వద్దా ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలుచొని.. నిలుచొని అస్వస్థతతో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసినా.. రద్దు నిర్ణయం ప్రకటించిన ఐదు వారాల తర్వాత కూడా బ్యాంకుల వద్ద నోట్ల కొరత నెలకొని ఉండటం.. ఖాతాలో ఉన్న డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకులు తమ వద్ద డబ్బులు లేవని ప్రకటించటంపై సామాన్య జనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురుగావ్ లోని ఒక బ్యాంకు దగ్గర ఒక రిటైర్డ్ సైనికుడు ఏడుస్తున్న ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఈ ఫోటో ప్రచురితం కావటం.. వెనువెంటనే ఆన్ లైన్లో ఈ ఫోటో వైరల్ గా మారింది. భారత్.. పాక్ తో 1971లో జరిగిన యుద్దంలో పాల్గొన్న ఈ వీర జవాను. . ఈ రోజు తన పెన్షన్ డబ్బుల్ని బ్యాంకు నుంచి తీసుకోవటానికి మూడు రోజుల నుంచి క్యూ లైన్లో నిలుచొని.. బ్యాంకు సిబ్బంది తీరుతో వేదనతో ఏడుస్తున్న ఫోటో ఇప్పుడు అందరిని కదిలించి వేస్తోంది.

నేను ఎవరి డబ్బును ఆశించటం లేదు.. నా ఖాతాలోఉన్న నా డబ్బును ఎందుకు తిరిగి ఇవ్వరు? అందుకోసం ఎందుకింతగా ఇబ్బంది పెడుతున్నారంటూ అని ప్రశ్నించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఆ వృద్ధ సైనికుడికి సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. సైనికుడి రోదన సోషల్ మీడియాను కదిలించి వేయటమే కాదు.. మోడీ సర్కారుపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చేసి.. ఆ తర్వాత సైన్యంలో పని చేసిన ఈ ఎక్స్ సర్వీస్ మెన్ రోదన సోషల్ మీడియాను కదిలించి వేస్తోంది. 78ఏళ్ల వయసులో మూడు రోజులుగా బ్యాంకు క్యూ లైన్లో నిలుచున్నా.. బ్యాంక్ ఖాతాలో ఉన్న తన పెన్షన్ డబ్బుల్ని తీసుకునే అవకాశం లేకపోవటంతో నంద లాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. కన్నీరు కార్చిన దృశ్యాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన కెమేరామెన్ తన కెమేరాలో బంధించిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News