ఈసీ మీద ఎప్పుడూ ప‌డ‌ని మ‌ర‌క ప‌డిందిగా!

Update: 2019-07-04 05:23 GMT
గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీద ఒక మ‌ర‌క ప‌డింది. అది కూడా అల్లాట‌ప్పా వాళ్లు వేసిన మ‌ర‌క కాదు. గ‌తంలో కీల‌క స్థానాల్లో ప‌ని చేసిన 145 మంది మాజీ ఉన్న‌తాధికారులు ఈసీ మీద సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేద‌ని.. ఎన్నిక‌ల సంఘం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న తీవ్ర ఆరోప‌ణ చేశారు.

2014తో పోలిస్తే 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ ఘ‌న విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ గెలుపు మీద భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇంత భారీ ఎత్తున మాజీ ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీద ఇంత తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ సంద‌ర్భంగా వారు ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తున్నారు.

రాజ‌కీయ పార్టీలు.. మీడియా సంస్థ‌ల‌తో పాటు ఓట‌ర్ల అభ్య‌ర్థుల‌ను కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ప‌లు ఫిర్యాదులు చేశార‌ని.. బీజేపీ చేసిన ఉల్లంఘ‌న‌ల గురించి వారి దృష్టికి తీసుకెళ్లినా సానుకూలంగా స్పందించ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌ట‌న మొద‌లు కోడ్ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌ల విష‌యంలోనూ ఈసీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎప్పుడూ చోటు చేసుకోలేద‌ని వారు వాపోవ‌టం చూస్తే.. ఇంత తీవ్ర‌మైన మ‌ర‌కను ఈసీ ఏ రీతిలో తుడుచుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News