రేవంత్.. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ వంచాలో బాగా తెలుసు

Update: 2021-06-28 11:30 GMT
‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే’ నిజమైన మనిషి అని ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ ను ఉద్దేశించి ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు అదే డైలాగ్ ను అక్షరాల వల్లెవేస్తూ అదే రూట్ ను ఫాలో అయిపోతున్నాడు రేవంత్ రెడ్డి. తన రాజకీయ భవిష్యత్తుకు ప్రధాన ప్రత్యర్థులుగా మారిన సీనియర్ నేతలను ఒక్కొక్కరిని స్వయంగా వెళ్లి కలుస్తూ చిల్ చేస్తున్నారు. తిట్టిన వారితోనే శాలువాలు కప్పించుకుంటూ కాంగ్రెస్ సీనియర్లను మచ్చిక చేసుకుంటున్నారు. అసమ్మతికి చెక్ చెబుతున్నారు. రేవంత్ తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి బయట ఎంతో ఆవేశంగా కనిపిస్తారు. మాటల తూటాలు పేల్చుతారు. కేసీఆర్ సహా ప్రత్యర్థులను చెడుగుడు ఆడేస్తారు. పైగా యువకుడు, ఉత్సాహవంతుడు ఇలాంటి నేత ఇంతలా బెండ్ అయిపోయి తన పదవికి సోపానం చేసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు.

రేవంత్ లాంటి యువ నేత తనపై తిరుగుబాటు చేసిన వారిని.. తిట్టిన వారిని కూడా కూల్ చేస్తుండడం తాజాగా చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయగానే అంతకుముందే కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యతిరేకించారు. తనతోపాటు చాలా మంది వెళ్లిపోతారని.. పార్టీ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. రేవంత్ కు పీసీసీ ఇస్తే రాజీనామా చేస్తానన్నారు. రేవంత్ తెలంగాణ వ్యతిరేకి అని.. ఆయనకు టీపీసీసీ ఎలా ఇస్తారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉండి రేవంత్ ఆ పార్టీనే ఖతం చేశాడని.. ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా ఖతం చేస్తాడని వీహెచ్ మండిపడ్డారు.

అయితే తనను అంత తిట్టినా వ్యతిరేకించినా కూడా తాజాగా వీహెచ్ కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో పడితే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కలిసి పరామర్శించారు. ఆయన కోలుకోవాలని.. డాక్టర్లకు మంచి చికిత్స అందించాలని సూచించారు. వీహెచ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఇక వీహెచ్ కూడా పాత పగలు అన్నీ మరిచిపోయి రేవంత్ కు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

తిట్టిపోసిన వైరివర్గంతోనే చెలిమి చేస్తూ వారిని తనదారిలోకి తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి వెనక్కితగ్గిన తీరు ప్రశంసలు కురిపిస్తోంది. నాడు వైఎస్ ఆర్ లాంటి నేతలు కూడా ఇలానే తన వైరివర్గాన్ని స్వయంగా కలుస్తూ పగలు మరిచిపోదామని.. కలిసి పనిచేద్దామని రాజీ చేసుకునేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వారికి తనంటే ఎంత ద్వేషం ఉన్నా వెళ్లి కలుస్తూ గొప్ప నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటున్నాడు.

ఇటీవలే జానారెడ్డి, షబ్బీర్, పొన్నాల లక్ష్మయ్యలను కలిసి రేవంత్ రెడ్డి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంత పెద్ద పదవి వచ్చినా కూడా సీనియర్లను గౌరవిస్తూ వారి సూచనల ప్రకారమే నడుస్తానని చెబుతూ రేవంత్ చేస్తున్న రాజకీయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రేవంత్ తీరు చూసి ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే మగాడు’ అన్న డైలాగ్ ను ఆయన అభిమానులు మరోసారి వల్లెవేస్తున్నారు.
Tags:    

Similar News