‘నకిలీ’లకు కేసీఆర్ అభయహస్తం..?

Update: 2016-10-14 07:43 GMT
రాజకీయాల్లో ఆరోపణలు మామూలే. అయితే.. ఆ వచ్చే ఆరోపణలు ప్రజలు నమ్మేలా ఉంటే మాత్రం కష్టాలు తప్పనట్లే. ఇక.. అధికారంలో ఉన్న వారికి ఇలాంటి ఆరోపణల వల్ల జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆరోపణలు రాకుండా చేసుకోవటం కష్టమేమీ కాదు. అలా అని.. ఒక్క ఆరోపణలు లేకుండా పాలన సాధ్యం కాదు. కాకుంటే.. ఆరోపణల తీవ్రత ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు ముచ్చటే తీసుకుంటే.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముందు వరకు.. ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో వచ్చిన ఆరోపణలు అంటూ ఏమీ లేవు. అవినీతి మీద కూడా పెద్ద.. పెద్ద ఆరోపణలు వచ్చింది లేదు.

కానీ.. గడిచిన కొద్ది కాలంలో చాలా విషయాల్లో ఆరోపణల జోరు పెరుగుతోంది. తనకు సన్నిహితులు.. స్నేహితుల విషయంలో కేసీఆర్ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నమ్మకం కలిగించేలా ఉండటం.. వార్నింగ్ బెల్ లాంటిదేనని చెప్పక తప్పదు. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల చిట్టా చూసినప్పుడు పలు సందేహాలు తలెత్తక మానవు. ఆయన చేసిన ఆరోపణల్లో కొన్ని అంశాలు తీవ్రంగా ఉండటం గమనార్హం.

కల్తీ విత్తనాలతో పంట దెబ్బ తిని వేలాది మంది రైతులు రోడ్డున పడటానికి కారణమైన కంపెనీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. సదరు కంపెనీ కేసీఆర్ కు దగ్గర బంధువని.. అందుకే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు నకిలీ విత్తనాలు.. నకిలీ కంపెనీలు.. నకిలీ పాలనే కారణంగా ఎద్దేశా చేసిన కేవంత్.. ‘‘నకిలీ విత్తనాల కంపెనీకి చెందిన యజమాని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దగ్గర బంధువు. ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ కు రూ.50 కోట్లు చందాగా ఇచ్చారు. అందుకే ఇప్పుడు చర్యలు తీసుకోవటం లేదు. కల్తీ విత్తులతో నష్టపోయిన రైతులకు సదరు కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో 15 రోజుల గడువు అనంతరం కంపెనీలకు అనుమతి రద్దు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పిన‌ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాట వినకుండా బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అంటూ మండిపడుతున్నారు. రేవంత్ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బదులిస్తారా? ఇంతకీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైన ఆ నకిలీ కంపెనీ ఏది? దాని యజమాని ఎవరు? అన్నది తేలుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. వీటికి సమాధానం చెప్పేవారెవరు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News