ప‌ట్టిన ప‌ట్టు విడువ‌నంటున్న రేవంత్‌

Update: 2017-01-29 07:08 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై త‌న పోరాటానికి తెలంగాణ‌ తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  రేవంత్‌ రెడ్డి వీలైన‌న్నీ దారులు వెతుక్కుంటున్నారు. కాల‌గ‌మ‌నంలో ప‌క్క‌కుపోయిన అంశాల‌ను మ‌రోమారు తెర‌ మీద‌కు తీసుకువ‌స్తున్నారు. ఇదే కోవ‌లో తాజాగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులకు క్యాబినెట్‌ హోదా కల్పించడాన్నిసవాల్‌ చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ఆయన రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  ప్రభుత్వం పలువురిని సలహాదారులుగా - ఇతర పదువుల్లో నియమించి వారికి క్యాబినెట్‌ హోదా కల్పించడాన్ని రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ - ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు - ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వారికి క్యాబినెట్‌ హోదా ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. రాజ్యాంగంలోని 164(1) అధికరణానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అధికరణం ప్రకారం శాసనసభలోని మొత్తం సభ్యుల్లో 15 శాతానికి క్యాబినెట్‌ సంఖ్య పెరగకూడదని తెలిపారు. కానీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకూ క్యాబినెట్‌ హోదా ఇవ్వడంతో అనూహ్యంగా 15 శాతం నిబంధన పెరిగిపోతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయిన వారిని - ఇష్టమైన వారిని సలహాదారులుగా ఇతర పోస్టుల్లో నియమించి వారికి క్యాబినెట్‌ హోదా ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. వారిందరికీ జీతభత్యాలు - వసతులు వంటివీ తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతున్నట్టేనని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తొలిరోజు 2014, జూన్‌ 2న తొలి క్యాబినెట్‌ ఏర్పాటుకు ముందే ఆరుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిందని పేర్కొన్నారు. అందులో విద్యాసాగర్‌రావు వంటి వారున్నారని తెలిపారు. ఇలా చేయడం అన్యాయమని గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో సవాల్‌ చేశారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఆ కేసును పట్టించుకోవడం లేదని తెలిపారు. అందుకే తాను పిటిషన్‌ను దాఖలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్‌ చైర్మన్‌ - ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు - ప్రభుత్వ సలహాదారులు నియామకాలు జరిగాయని తీర్పునివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శితోపాటు సలహాదారులు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ - తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, టీఎస్‌ టీడీసీ చైర్మన్‌ తదితరులను చేర్చిన‌ట్లు రేవంత్ రెడ్డి వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News