అవకాశం దొరకాలే కానీ...ఇంకా చెప్పాలంటే...అవకాశం వచ్చిందని భావిస్తే చాలు..ఎమ్మెల్యే - ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన కుటుంబం - టీఆర్ ఎస్ పార్టీపై విరుచుకుపడుతుంటారు. తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. అలా రేవంత్ రెడ్డి ఓ అవకాశం వచ్చింది. అదే ఓ పత్రికల్లో కేటీఆర్ గురించి వచ్చిన ఫిట్ నెస్ కథనం. ఇంకేముంది..రేవంత్ రెడ్డి తనకు వచ్చిన అవకాశంతో కేటీఆర్ పై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ ఛాట్ చేస్తూ..కేటీఆర్ వి అన్ని ఫిట్ నెస్ పోజులేనని ఎద్దేవా చేశారు.చేతనైతే తనతో కేటీఆర్ 10k రన్నింగ్ రావాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లోనే కాదు ఏ ఆటలో కూడా కేటీఆర్ తనతో పోటీపడలేడని రేవంత్ వ్యాఖ్యానించారు. పాలిటిక్స్ ఫిట్‌నెస్ లో తనతో పోటీపడేవారు తెలంగాణలోనే లేరని రేవంత్ పేర్కొన్నారు.!
ఈ సందర్భంగా ఎప్పట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తన ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నాడు ఉద్యమ ముసుగులో వ్యక్తిత్వాన్ని కించపరిచే చిల్లర రాజకీయాలు చేసిన కేసీఆర్ నేడు అధికారం ముసుగులో పోలీసులతో చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో రాహుల్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. మోడీకి ధీటైన నాయకుడుగా ప్రజలకు రాహుల్ కనిపిస్తున్నాడని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో తన స్పీచ్ తో ప్రజలకు రాహుల్ మరింత దగ్గరయ్యారని విశ్లేషించారు. మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకుని తనను ద్వేషిస్తున్నావారికి మంచి సందేశాన్ని ఇచ్చారన్నారు. ఇక పార్టీలో దక్కే పదవి గురించి మీడియా ప్రస్తావించగా...పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ దాటవేసే దోరణిలో సమాధానం ఇచ్చారు.