రాజీనామానే? : బెజవాడలో భేటీకి రేవంత్ ఎగ్గొడతారా?

Update: 2017-10-27 10:38 GMT
‘తెలంగాణ తెలుగుదేశం పార్టీగా ఉంటున్నా సరే... కీలకమైన ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలోనూ ఉరుక్కుంటూ పొరుగురాష్ట్రం రాజధాని అమరావతికి వెళ్లాల్సిందేనాయె..! గంటలు గంటల తరబడి వెయిటింగ్ లో కూచున్నాక.. ఏదో నాలుగు నిమిషాలు చంద్రబాబుతో మాట్లాడి రావడమేనాయె...! తెలంగాణలో పార్టీని బతికించుకోడానికి అధినేత  అప్పుడప్పుడూ అయినా ఇక్కడకు రాకుండా అక్కడే కూసుంటే.. ఎలా...?’ కాంగ్రెసులోకి ఫిరాయించడానికి రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. తెలంగాణ తెలుగుదేశానికి పెను సంక్షోభంగా ఎదురుపడిన రేవంత్ ఫిరాయింపు ఎపిసోడ్ ను కూడా అమరావతి లోంచే పరిష్కరించడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. ఏదో మొక్కుబడిగా ఇక్కడ లీడర్లతో సమావేశమైన చంద్రబాబు నాయుడు, అందరి మాటలు విని, తానుగా ఏమీ చెప్పకుండానే అందరూ రేపు (శనివారం) ఉదయం 10 గంటలకు అమరావతికి వచ్చేయండి అంటూ పురమాయించి ముగించారు.

అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారనే మాట కూడా ముమ్మరంగా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడుతో ఆయన ఆంతరంగిక భేటీలో ఇలాంటి సంకేతమే వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజీనామా జరిగినా జరగకపోయినా కూడా.. రేవంత్ రెడ్డి అమరావతి వెళ్లి తెలంగాణ తెదేపా పార్టీకోసం చంద్రబాబునాయుడుతో సమావేశం కావడం మాత్రం జరగకపోవచ్చునని.. ఆ భేటీ కంటె ముందే రాజీనామా లేదా.. పార్టీని వీడుతున్న ప్రకటన అధికారికంగా వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

రేవంత్ రెడ్డి బహశా తెలుగుదేశానికి సంబంధించి, ఏపీ తెలుగుదేశం నాయకుల గురించి ఇక ఎలాంటి విమర్శల జోలికి వెళ్లకుండానే.. కేవలం తన రాజీనామా  ప్రకటన మాత్రం చేస్తారని, అంతవరకు పార్టీకి తన చివరి ఫేవర్ చేయదలచుకున్నారని కూడా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి శనివారం అమరావతిలో జరగబోయే భేటీ కేవలం.. రేవంత్ రాజీనామా తర్వాత.. తెలంగాణ పార్టీని కాపాడుకోవడం ఎలా అనే అంశం ఒక్కటే ఎజెండా గా సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News