చ‌ర్చ ర‌చ్చ‌..రేవంత్ వ‌ర్సెస్ టీఆర్ ఎస్‌

Update: 2018-01-11 16:18 GMT
అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య అందులోనూ కీల‌క నాయ‌కుల మ‌ధ్య వాదోప‌వాద‌ల‌కు క‌రెంటు వేదిక అయింది. నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాపై కాంగ్రెస్ నేతలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి - రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు చేయ‌డం - అధికార టీఆర్ ఎస్ నేత‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డంతో గ‌త మూడ్రోజుల‌గా తెలంగాణ రాజ‌కీయం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది గురువారం మ‌రో మలుపు తిరిగింది. ఇటు కాంగ్రెస్ నేత‌లు - అటు టీఆర్ ఎస్ నేత‌ల ప‌ర‌స్ప‌ర స‌వాళ్ల‌తో ఘాటెక్కింది.

విద్యుత్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నార‌ని టీఆర్ ఎస్‌ ఎంపీ బాల్క సుమన్ - ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి - భానుప్రసాద్ మండిప‌డ్డారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌ పై బురద చల్లేందుకు కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నరని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ఏమాత్రం విశ్వసనీయతలేని వ్యక్తి.. గజదొంగన్నారు. దిగజారుడు రాజకీయాలకు రేవంత్‌ రెడ్డి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. కరెంట్‌ పై చర్చకు జానారెడ్డి వస్తడా.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వస్తడా అని మేము సవాల్ చేస్తే దానిపై వాళ్లిద్దరు స్పందించకుండా రేవంత్‌ రెడ్డి దొంగలాగా ప్రెస్‌ నోట్ రిలీజ్ చేసిండని తెలిపారు. చీప్ పబ్లిసిటీ కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డి కాదు చర్చకు వచ్చేది విశ్వసనీయత ఉన్న వ్యక్తులే చర్చకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో ఎన్ని రోజులుంటడో ఆయనకే తెలియదన్నారు. రేవంత్‌ రెడ్డి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నడు. జానారెడ్డి - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చర్చకు వస్తే విద్యుత్ లెక్కలు సవివరంగా తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా చేశానని చెప్పి.. ఆ లేఖను స్పీకర్‌ కు పంపిన అబద్దాల కోరు రేవంత్‌ రెడ్డి. అలాంటి వ్యక్తి ఏ హోదా ఉందని చర్చకు వస్తడని ప్రశ్నించారు.

కాగా, ఈ విలేక‌రుల స‌మావేశంపై రేవంత్ వెంటనే పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. విద్యుత్  రంగంలో జ‌రిగిన అవినీతిపై అవాస్త‌వాలు మాట్లాడుతున్నామ‌ని ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరిన పాల‌క‌ప‌క్షం మేము కూడా బ‌హిరంగ చ‌ర్చ‌కు సై అనేస‌రికి తోక‌ముడిచి పారిపోయిందని ఎద్దేవా చేశారు. `విద్యుత్ ఉత్ప‌త్తి - కొత్త ప్లాంట్ల నిర్మాణం - విద్యుత్ కొనుగోళ్ల‌లో జ‌రుగుతున్న అవినీతిని మేము ఎత్తిచూప‌డంతో టీఆర్ ఎస్ నేత‌లు బాల్క స‌మ‌న్‌ - ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి - భాను ప్ర‌కాష్ ...రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నాడు - అన్నీ అబ‌ద్ధాలు చెబుతున్నాడంటూ మ‌మ్మ‌ల్ని బ‌హిరంగ చ‌ర్చ‌కు ర‌మ్మంటూ పిల‌వ‌డం - మాది త‌ప్ప‌ని తేలితే మేము ముక్కును నేల‌కు రాస్తాము.. రేవంత్ రెడ్డి చెబుతున్న‌ది త‌ప్ప‌ని తేలితే ఆయ‌న అబిడ్స్ సెంట‌ర్‌ లో ముక్కును నేల‌కు రాయాలి.. అంటూ స‌వాల్ చేయ‌డం మీకు తెలిసిందే. మేము ఈ స‌వాల్‌ ను స్వీక‌రించి నేను - నాతో పాటు ఎమ్మెల్యే సంప‌త్ కుమార్‌ - టిపిసిసి అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్‌ తో క‌లిసి  12వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్చ‌కు వ‌స్తాము - మీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు ర‌మ్మ‌న్నా - ఇంకెక్క‌డికి ర‌మ్మ‌న్నా రావ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాము. అయితే నిన్న ద‌మ్ముంటే రేవంత్ రెడ్డి బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ చేసిన వారు ఈ రోజు  రేవంత్ రెడ్డితో చ‌ర్చించేది లేద‌ని మాట మార్చేశారు. వారి బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డి పారిపోయారు. విద్యుత్ రంగంలో అన్నింటా అవినీతికి పాల్ప‌డుతున్న పాల‌క‌ప‌క్షం ప‌లాయ‌న‌వాదం ఎత్తుకున్నా వారు చేసిన అవినీతి - అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టేవ‌ర‌కూ వ‌దిలేది లేదు. దీనిలో భాగంగానే రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గాంధీభ‌వ‌న్‌ లో  ప‌త్రికా విలేఖ‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హిస్తాం, వారి అవినీతి ఆధారాల‌ను బ‌య‌ట‌పెడ‌తాం` అని రేవంత్ వివ‌రించారు.

దీంతో ఈ విమ‌ర్శ‌లు - స‌వాల్లు ప్ర‌తి స‌వాల్ల ప‌ర్వం మ‌రో రోజు కూడా కొన‌సాగనుంది. సంక్రాంతి పండ‌గ ముందు ఈ స‌వాల్ల ప‌ర్వం తెలంగాణ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News