కేసీఆర్‌ ను కొత్తగా ఇరుకున పెట్టిన రేవంత్

Update: 2016-08-16 14:06 GMT
తెలుగుదేశం పార్టీ వ్య‌వస్థాప‌క అధ్య‌క్షుడు నందమూరి తారకరామారావు కేంద్రంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ ను టీటీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇరుకున ప‌డేశారు. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టేసి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేస్తూనే సొంతంగా ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు రేవంత్‌ ఏకంగా కేసీఆర్‌ కు బ‌హిరంగ లేఖ రాశారు.

గతంలో శంషాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్ లోని దేశీయ‌ టెర్మినల్‌ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీర్మానించింద‌ని గుర్తు చేసిన రేవంత్ తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషి - సేవలకు గుర్తింపుగా దేశీయ టెర్మినల్‌ కు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌ని కోరారు. తెలుగు ప్రజలకు ఎనలేని సేవచేసిన ఎన్టీఆర్‌ కు కొత్త రాష్ట్రమైన తెలంగాణలో సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రేవంత్ అన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర గౌరవం కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేశారు.

ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో ముఖ్యమంత్రి హోదాలో మీరు సైతం ఎన్టీఆర్‌ ను ప్ర‌శంసించార‌ని రేవంత్ పేర్కొన్నారు. “తెలుగుప్రజల గొప్పదనాన్ని తెలుగుదనాన్నితెలియజెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగువాళ్లను మద్రాసీ అని పిలిచే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందని చెప్పి తెలుగువారికి గౌరవం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది. హైదరాబాద్‌ లో ప్రతిష్టిస్తున్న అంబేద్కర్ విగ్రహం విషయంలో కొందరు లేనిపోని వార్తలు పుట్టించారు. ఎన్టీఆర్ ఫూట్ చిరస్థాయిగా అలానే ఉంటుంది. ఎన్టీఆర్ ఓ తరం నటుడు కాదు గొప్ప తెలుగు బిడ్డ. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏమూలకి వెళ్లినా ఆయన గురించి గొప్పగా చెబుతారు. ఎన్టీఆర్ జ్ఞాపకాలన్నీగుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి” అని చేసిన బాస‌ల‌కు త‌గిన‌ట్లు ఆయ‌న పేరును దేశీయ టెర్మిన‌ల్‌ కు పెట్టాల‌ని కోరారు.

త‌మ పార్టీ నాయ‌కుడిగా ఎన్టీఆర్ పేరును టెర్మిన‌ల్‌ కు పెట్టాలంటే కేసీఆర్ అంగీకరించ‌ర‌నే ఉద్దేశంతోనే రేవంత్ ఈ విధంగా కేసీఆర్ చేసిన మాట‌ల‌ను ప్ర‌స్తావించార‌ని రాజకీయ వ‌ర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా బ‌హిరంగ లేఖ రాయ‌డం ద్వారా సొంత మాట‌ను నిలుపుకుంటారో లేదా తేల్చుకోవ‌డం అనేది కేసీఆర్‌ కే వ‌దిలివేయ‌డం ద్వారా రేవంత్ చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించార‌ని అంటున్నారు.
Tags:    

Similar News