వాడిని రాళ్లతో కొట్టి చంపాలి.. గడ్డపార తెచ్చి గుండెల్లో దింపాలి.. రేవంత్ సంచలనం

Update: 2021-07-02 08:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిన మాట చెప్పే ఆయన.. ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం తడుముకోకుండా చెబుతారు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలంటూఏమీ ఉండవన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఇరుకున పడేలా ప్రశ్నించినా దానికి భిన్నంగా రియాక్టు కావటం మామూలే. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అదరగొట్టే వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు అధికార పార్టీలో చేరతారంటూ ప్రజల్లో ముద్రపడింది కదా? దాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అందుకు రేవంత్ స్పందిస్తూ.. ‘‘ఇక నుంచి కాంగ్రెస్ ఇచ్చే బీఫారంపై గెలిచిన తర్వాత ఎవడైనా పార్టీ మారితే.. వాడిని రాళ్లతో కొట్టి చంపాలని.. గడ్డపార తెచ్చి గుండెల్లో దింపాలని ప్రజలకు.. పార్టీ కార్యకర్తలకు చెబుతున్నా. ఓటర్లు గుండెల్లో పెట్టుకొని గెలిపిస్తే.. అక్రమ కేసులు.. సొంత అవసరాలకు భయపడి పార్టీ మారుతున్నారు’’ అని మండిపడ్డారు.

వీరి కారణంగా కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా చాలా దెబ్బలు తగుుతున్నాయన్న రేవంత్.. ఇకపై ఎవరికి టికెట్ ఇచ్చినా. పార్టీలో ఉంటాడా? పోతాడా? అని నిర్దారణ చేసుకున్నాకనే టికెట్ ఇస్తామన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారితే తెలంగాణ సరిహద్దులు దాటే వరకు కార్యకర్తలతో తరిమి కొట్టిస్తానని చెప్పిన ఆయన ఫిరాయింపుదారులపై తీసుకునే కఠిన చర్యల్లో తానే ముందుంటానని చెప్పారు. పార్టీ మారే వారి పని చెబుతానంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

ఇప్పటికే పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవటానికి తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఈ కేసు కోర్టులో ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని.. సుప్రీంకోర్టులో కేసు వేసి అతి తక్కువ సమయంలో విచారణకు వచ్చేలా చూస్తానని చెప్పారు. కర్ణాటక.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్ లలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టులు అనర్హత వేటు వేసిన వైనాన్ని గుర్తు చేశారు. పార్టీని వదిలి వెళ్లిన వారిని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం ఉందని.. త్వరలోనే ఘర్ వాపసీ ఉంటుందన్నారు.

సీనియర్ నాయకులతో కమిటీని ఏర్పాటు చేసి వారి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి హామీ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తిస్తామని.. వారి నుంచి స్పష్టత వచ్చిన తర్వాత పార్టీ కండువా కప్పుతామని చెప్పారు. తన వరకు కార్యకర్తలే కథానాయకులని.. తన బలం.. ప్రాధాన్యం వారేనని స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకొని ముందుకు వెళతామన్నారు.తనకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ నేతలు పలువురు టీఆర్ఎస్.. బీజేపీలోకి వెళ్లనున్నారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కచ్ఛితంగా పరిష్కరిస్తామని.. కాంట్రాక్టులు.. డబ్బులు కావాలని పోతే మాత్రం చేయటానికి ఏముంటుందని తేల్చేశారు.
Tags:    

Similar News