కేసీఆర్ లాగే మోడీది రాక్ష‌స క్రీడ: రేవంత్‌

Update: 2017-12-19 11:54 GMT

గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలుగు రాష్ర్టాల్లో హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. ఓవైపు ఏపీలో మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-బీజేపీల మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రుగుతుండ‌గా... ఇప్పుడు వైరిప‌క్షాల మ‌ధ్య కూడా ఈ ఫ‌లితాలు పంచాయ‌తీకి దారితీస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ పంచాయ‌తీలోకి దిగింది. ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేరిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుజ‌రాత్ ఫ‌లితాల‌పై ఆక్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ప్ర‌ధాని మోడీ కాపీ కొట్టార‌ని ఆరోపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ లాగే గుజరాత్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా ఫిరాయింపులతో రాక్షస క్రీడ ఆడారని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. సొంత ఊరిలో ఓడిపోయిన మోడీ...గుజరాత్ లో గెలిచినట్టా అని రేవంత్ ఎద్దేవా చేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వ‌చ్చిన మెజార్టీ... ఇప్పుడు బీజేపీకి గుజరాత్ లో ఎందుకు రాలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. అభివృద్ధిని వదిలిపెట్టి కుల - మతతత్వ రాజకీయాలతో ప్రచారం చేశాడ‌ని మండిప‌డ్డారు. ఒక్క రాహుల్ గాంధీ ని ఎదుర్కోవటానికి 182 మంది బీజేపీ నేతలు కావాల్సి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌చారంలోకి పాకిస్తాన్‌ ను కూడా తీసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఒక‌వేళ ప్ర‌ధాని మోడీ ఆరోపించిన‌ట్లు...తన హత్యకి సుపారి ఇచ్చింది నిజం అయితే ఎందుకు మోడీ చర్యలు తీసుకోరని నిల‌దీశారు.

మోడీ హత్యకి పాక్ సుపారి తీసుకుంటే యుద్ధం ప్రకటించాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ప్ర‌ధాని మోడీ - బీజేపీ ర‌థ‌సార‌థి అమిత్ షా నీచ రాజకీయాలు చూసే గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న అద్వానీ ప్రచారానికి వెళ్ళలేదని ఆరోపించారు. బీజేపీ చరిత్రలోనే తొలిసారి అద్వానీ ప్రచారానికి వెళ్లలేదని రేవంత్ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్ప‌టికీ...ఇప్పటి వరకు అద్వానీ శుభాకాంక్షలు చెప్పలేదని రేవంత్ అన్నారు. వాజపేయి - అద్వానీ విలువలతో కూడిన రాజకీయాలు చేశార‌ని ఇప్పుడు బీజేపీలో ఆ ప‌రిస్థితి లేనేలేద‌న్నారు.
Tags:    

Similar News