కేటీఆర్ అమ్ముల పొదిలో కేసీఆర్ అస్త్రాలు మిస్

Update: 2021-09-22 03:15 GMT
మిమ్మల్ని అదే పనిగా టార్గెట్ చేశారనుకోండి? మీరేం చేస్తారు? ఒకటి.. మాటకు మాట బదులివ్వటం. దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. వారు మాట్లాడే ప్రతి మాటకు బదులు ఇవ్వటమంటే.. వారి మాటలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్న వైనాన్ని చెప్పేసినట్లే. అలాంటప్పుడు ఏం చేయటమంటే.. వారి మాటల్ని సింఫుల్ గా విస్మరించటం. ఏమన్నా.. లైట్ తీసుకోవటం.. గురి చూసి కొట్టినట్లుగా.. ఏదో ఒక విషయాన్ని బలంగా తీసుకొని దెబ్బ కొట్టటం లాంటివి చేయాలి. .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత తీరును చూస్తే.. ఇదే అంశం ఆయనలో బలంగా కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే.. ఆయన బలం కూడా అదే.

తన రాజకీయ ప్రత్యర్థుల మీద అదే పనిగా విమర్శలు చేయటం.. విరుచుకుపడటం.. రోజువారీ ఎపిసోడ్ మాదిరి ఒకే అంశానికి ఎక్కువ  ప్రాధాన్యత ఇవ్వటం లాంటివి చేయరన్నది తెలిసిందే.తనను టార్గెట్ చేసిన వారికి.. హోల్ సేల్ గా పంచ్ లు ఇచ్చేందుకే ఆయన ఇష్టపడుతుంటారు. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ తీరు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనను తప్పు పట్టే వారి విషయం ఎలా ఉన్నా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విషయంలో మాత్రం ఆయన సీరియస్ గా కనిపిస్తారు.

ఆయన నోటి నుంచి ఏదైనా విమర్శ వినిపించినంతనే.. దానికి బదులివ్వాలన్న తపన కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఈ తీరు ఆయన చేత తప్పులు చేసేలా చేయటమే కాదు.. రేవంత్ పైచేయి సాధించటానికి అవకాశాన్ని ఇస్తుందన్న మాట వినిపిస్తోంది. నిజానికి.. శశిథరూర్ ఎపిసోడ్ లో రేవంత్ దారుణమైన ఎదురుదెబ్బ తిన్నారు. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఎపిసోడ్ లో మంత్రి కేటీఆర్ మాస్టర్ స్ట్రోక్ ఆయన ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేదే. అయితే.. ఈ సువర్ణ అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నారు కేటీఆర్.  తన చేతికి వచ్చిన ఛాన్సును అనవసరమైన డ్రగ్స్ పరీక్ష ఎపిసోడ్ వైపునకు మళ్లించటం ద్వారా ఆయన పెద్ద తప్పు చేశారు.

నిజం చెప్పాలంటే.. శశిథరూర్ ఎపిసోడ్ నుంచి ఫోకస్ తప్పించటం కోసం వెతుకుతున్న రేవంత్.. డ్రగ్స్ టెస్టు ఎపిసోడ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ విషయంలో అవసరానికి మించి స్పందించిన కేటీఆర్.. ఒకట్రెండు ట్వీట్లతో ఆపితే బాగుండేది. అందుకు భిన్నంగా..ఆయన  రాహుల్ ప్రస్తావన తేవటం.. ఇందుకు బదులుగా రేవంత్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనతో పాటు.. గతంలో ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని తాజాగా చర్చకు తీసుకొచ్చారు. ఇదంతా చూసినప్పుడు కదిలించుకొని మరీ తిట్టించుకున్న చందంగా పరిస్థితి మారిందని చెప్పాలి.

అవసరం లేని విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సాధించేదేమీ ఉండదు. అధికారం చేతిలో ఉన్న వాడిని పవర్ లేనోడు సవాలచ్చ అంటాడు. వాటిని ప్రజలు నమ్మి.. తమ ఇమేజ్ దారుణంగా దెబ్బ తీస్తుందన్న భావనకు వచ్చినప్పుడు బదులివ్వటంలో తప్పు లేదు కానీ.. అందుకు భిన్నంగా అదే పనిగా రియాక్టు కావటం.. కొత్త సందేహాలకు తావిస్తుందన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారు. తన తండ్రి అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రమైన ‘విస్మరించటాన్ని’ ఆయన ఎందుకు వదులుకుంటున్నారు.

తన రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శల్ని.. ఆరోపణల్ని విస్మరిస్తూ.. సమయం చూసుకొని అన్నింటికి సమాధానాలు ఇచ్చే అలవాటును మిస్ కావటం మంచిది కాదంటున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు ఎంత స్పందించాలన్న దానికి కేసీఆర్ దగ్గర ఉండే కొలత కేటీఆర్ దగ్గర లేదని.. ఇదో పెద్ద లోపంగా చెబుతున్నారు. తాజా ఎపిసోడ్ లో ఈ విషయం స్పష్టమైందని.. ఇప్పటికైనా అనవసరమైన విషయాలకు.. తన ఇమేజ్ ను దెబ్బ తీసే అంశాలకు కేటీఆర్ తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని.. లేదంటే మరింత డ్యామేజ్ తప్పదని చెబుతున్నారు.
Tags:    

Similar News