రేవూరి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రం!

Update: 2018-10-11 08:27 GMT
తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత‌ల్లో రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి ఒక‌రు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఆయ‌న ఓ వెలుగు వెలిగారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో - ప్ర‌భుత్వంలో ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ను అలంక‌రించారు. కానీ, ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా మారింది. మ‌హాకూట‌మి ఏర్పాటు ఆయ‌న‌కు తీర‌ని వ్య‌థ‌ను మిగులుస్తోంది.

రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి గ‌తంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాని న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది ఆయ‌న స్వ‌స్థ‌లం. స్థానికంగా మంచి ప‌ట్టుంది. రాష్ట్ర విభ‌జ‌న అనంతరం తెలంగాణ‌లో టీడీపీ నీరుగారిపోయినా.. తోటి నాయ‌కులంతా టీఆర్ ఎస్‌ లోకి వ‌ల‌స బాట ప‌ట్టినా రేవూరి మాత్రం పార్టీని వ‌ద‌ల్లేదు. తెలుగుదేశంనే న‌మ్ముకున్నారు. కాస్తో కూస్తో పార్టీ క్యాడ‌ర్‌ ను కాపాడుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన దొంతి మాధ‌వ రెడ్డి చేతిలో ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికీ.. ఈసారి విజ‌యంపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. చాన్నాళ్ల క్రితం నుంచే నియోజ‌క‌వ‌ర్గమంతా తిరుగుతున్నారు.

అయితే, అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన మ‌హాకూట‌మి రేవూరి ఆశ‌ల‌పై ప్ర‌స్తుతం నీళ్లు చ‌ల్లుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి ఆయ‌న్ను దూరం చేస్తోంది. మ‌హాకూట‌మితో టీడీపీ - కాంగ్రెస్ ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన దొంతి మాధ‌వ‌రెడ్డి ఇటీవ‌లే త‌న సొంత‌గూడు కాంగ్రెస్‌ కు తిరిగి చేరుకున్నారు. దీంతో నర్సంపేట‌ను త‌మ సిట్టింగ్ స్థానంగా పేర్కొంటున్న కాంగ్రెస్‌.. ఆ సీటు త‌మ‌కే కావాల‌ని భీష్మించుకు కూర్చుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని వేరొక‌రికి ఆ సీటివ్వ‌డం స‌రికాద‌ని చెబుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ 34 మంది అభ్య‌ర్థుల‌తో ఖ‌రారు చేసిన త‌మ తొలి జాబితాలో న‌ర్సంపేట సీటును దొంతికి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది కూడా. దీంతో ఆ స్థానంపై ఆశ‌లు పెట్టుకున్న రేవూరి ప‌రిస్థితి ప్ర‌స్తుతం తెగిన గాలిప‌టంలా త‌యార‌య్యింది.

పొత్తుల్లో భాగంగా న‌ర్సంపేట సీటు ద‌క్క‌క‌పోతే.. క‌నీసం ప‌రకాల నుంచి పోటీ చేయాల‌ని రేవూరి ఇన్నాళ్లూ భావించారు. అయితే, ఆలోపే టీఆర్ ఎస్ నుంచి కొండా సురేఖ తిరిగి కాంగ్రెస్‌ లో చేర‌డం.. తాను ప‌ర‌కాల నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం.. కాంగ్రెస్ కూడా ఆ సీటును సురేఖ‌కే కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో ప‌రకాల‌కు కూడా రేవూరి దూర‌మయ్యాడు. కాస్త దూర‌మైనా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుందామంటే.. అక్క‌డ కూడా త‌మ సీనియ‌ర్ నేత గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి పేరును కాంగ్రెస్ ఇప్ప‌టికే ఖ‌రారు చేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక రేవూరి త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ని ప‌లువురు చెబుతున్నారు. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన త‌మ‌ నాయ‌కుడికి సీటు ద‌క్క‌క‌పోవ‌డంపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్ర మ‌నో వేద‌న‌కు గుర‌వుతున్నార‌ని స‌మాచారం.

Tags:    

Similar News