ఎమ్మెల్యే రఘునందన్ పై మరోసారి ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

Update: 2022-06-10 10:30 GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిందంటే ప్రధాన కారణం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. పోలీసులు అసలు ఎమ్మెల్యే కొడుకు లేడని.. ఓ బోర్డు చైర్మన్ కుమారుడికి ప్రమేయం లేదని తేల్చేసిన వేళ వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేసి మరీ వారి అడ్డంగా బుక్ చేశారు రఘునందన్ రావు. అందుకే ఆయన ఇప్పుడు హీరో అయిపోయారు. రఘునందన్ రావు ధైర్యసాహసాలకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఫిదా అయిపోయారు. రఘునందన్ ఫొటోలు, వీడియోలు బయటపెట్టడం వల్లే ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే.

ఇక బాధితురాలితోపాటు నిందితులు కూడా మైనర్లు కావడంతో ఓ న్యాయవాది ఫిర్యాదులో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో దుబ్బాక ఎమ్మెల్యే పై కేసు కూడా నమోదైంది. పోలీసులు ఆయనకు నోటీసులు కూడా పంపారు. సాక్ష్యాలను బయటపెట్టిన తనకు పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి.. ముద్దాయిని చేశారని రఘునందన్ రావు వాపోయారు.పోలీసులు పెట్టిన కేసు విషయమై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామన్నారు.

కాగా ఇప్పటికే రఘునందన్ రావు సాక్ష్ాయలను బయటపెట్టిన విషయమై దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసించారు. తాజాగా మరోసారి స్పందించారు. రఘునందన్ రావును దాదాపు ప్రధాన నిందితుడిగా పరిగణిస్తుండడం భీతిని కలిగిస్తోందన్న వర్మ.. ప్రధాన కేసును రెండో కేసుగా చూపిస్తున్నారని ఆరోపించారు.

ఒకవేళ రఘునందన్ రావు గొంతుక వినిపించకపోయి ఉండుంటే.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు ఎక్కడికి పోయిండేదో ఆ దేవుడికే తెలుసన్నారు. అమ్మాయికి న్యాయం జరగడం కోసం వ్యవస్థతో పోరాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యేకు మనం రుణపడి ఉండాలని వర్మ ట్వీట్ చేశారు.

దిశ కేసులో నిందితులైన మైనర్ల ఫొటోలను పదే పదే మీడియాలో చూపించారని.. వాళ్ల కుటుంబ సభ్యులను పోటీపడి ఇంటర్వ్యూలు చేశారు కదా? వాళ్లకు ఒక రూల్.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు మరో రూలా?' అని రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకూ ఆయనపై సెక్షన్ 228 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న వారంతా సైలెంట్ అయిపోయారని వర్మ వ్యాఖ్యానించారు.

రఘునందన్ రావుకు మద్దతుగా వర్మ ట్వీట్లు చేయగా.. చాలా మంది ఈ విషయంలో వర్మతో ఏకీభవిస్తూ సపోర్టు చేశారు. మైనర్ల ఫొటోలు బయటపెట్టడం విరుద్ధమే కావచ్చని.. కానీ అది మైనర్లే సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఒక లాయర్ గా రఘునందన్ రావు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఈ పనిని తప్పుపట్టడం లేదని వర్మ ఆయనకు సపోర్టుగా సంచలన కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.
Tags:    

Similar News