బ్రిటన్ ప్రధానిగా రిషి.. ప్రపంచ దేశాల్లో మనోళ్లు ఏలుతున్న దేశాలివే

Update: 2022-10-25 04:23 GMT
వందల ఏళ్లు మన దేశాన్ని ఏలి.. మనల్ని బానిసలుగా చూసి.. లక్షలాది మంది మాన ప్రాణాల్ని దోచుకునే తెల్లోళ్ల రాజ్యాన్ని ఏలేందుకు మన మూలాలున్న వ్యక్తి ఒకరు మరికొద్ది రోజుల్లో బ్రిటన్ కు ప్రధాని కానున్నారు. కలలో కూడా ఊహించలేని ఈ పరిణామం కోట్లాది మంది భారతీయుల్ని సంతోషానికి గురి చేస్తోంది. ఒకప్పుడు మనల్ని ఏలేసిన వారికి.. మనమే ఇప్పుడు దిక్కు కావటం కచ్ఛితంగా కాల మహిమగానే చెప్పాలి. బ్రిటన్ ప్రధానమంత్రిగా మరికొద్దిరోజుల్లోనే పదవీ బాధ్యతలు చేపట్టనున్న వేళ.. రిషి మాదిరే మనోళ్లు పలువురు పలు దేశ రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నారు.

అలాంటి వారి లెక్క చూస్తే.. ఆరు దేశాల్లోని అధ్యక్ష.. ప్రధానమంత్రి.. ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతికి చెందిన వారు నిలవనున్నారు. ఒకప్పటి రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి.. తొలిసారి శ్వేతజాతీయుడు.. హిందూ మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో జన్మించిన రిషి పూర్వీకుల మూలాలు భారత్ లోని పంజాబ్ లో ఉన్నాయి.

పంజాబ్ నుంచి టాంజానియా.. ఆ తర్వాత కెన్యా.. అక్కడి నుంచి బ్రిటన్ కు వలస వెళ్లారు. బోరిస్ జాన్సన్ ప్రధానిగా వ్యవహరించిన వేళ.. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పని చేసి గుర్తింపు పొందిన రిషి.. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానిగా బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న మనోళ్లను చూస్తే..  ఆంటోనియా కోస్టాను చెప్పాలి. ఆయన ప్రస్తుతం పోర్చుగల్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గోవా ప్రాంతానికి చెందిన వారిగా ఆయన్ను చెప్పాలి. అదెలా అంటే.. ఆయన తండ్రి ఆర్నాల్డో డాకోస్టా.. గోవా ప్రాంతానికి చెందిన వారు.

గయానా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా భారత మూలాలుఉన్న వ్యక్తే. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతల్ని ఆయన చేపట్టారు. మరో భారత మూలాలు ఉన్న నేత.. హిందూ కుటుంబానికి చెందిన ప్రవింద్ జుగ్నాథ్ మారిషస్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. 2017 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఇక.. అదే దేశానికి చెందిన అధ్యక్ష బాధ్యతల్ని కూడా భారత మూలాలు ఉన్న వ్యక్తే నిర్వహిస్తుండటం విశేషం. మారిషస్ దేశ అధ్యక్షుడిగా ప్రథ్వీరాజ్ సింగ్ రూపున్ వ్యవహరిస్తున్నారు. 2019లో ఆయన మారిషస్ దేశాధ్యక్షుడుయ్యారు. పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన మారిషస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇక.. దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రికా ప్రసాద్ సంతోఖి కూడా భారత మూలాలు ఉన్న వ్యక్తి. 1959లో జన్మించిన ఆయన ఫ్యామిలీ కూడా భారత మూలాలు ఉన్న వ్యక్తే. ఇక.. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికాకు ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమలా హ్యారిస్ సైతం భారత మూలాలు ఉన్న వ్యక్తే కావటం గమనార్హం.

ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని తులసేంద్రిపురానికి చెందిన వారు. అన్ని బాగుంటే.. ఆమె సైతం అమెరికా అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. కేవలం.. కాలం కలిసి రావటం మినహా మరేమీ లేదన్న మాట వినిపిస్తోంది. ఈ ఆరు దేశాలతో పాటు ట్రినిడాడ్ -బొబాగో, పోర్చుగల్, మలేషియా.. ఫిజీ, ఐర్లాండ్ లాంటి దేశాల్లోనూ భారత సంతతికి చెందిన పలువురు కీలక పదవుల్లో ఉన్నారు. భారతీయుడా.. మజకానా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News