పీఓకేలో ఈ బాలీవుడ్ వెట‌రన్ వేలు పెట్టేశారే!

Update: 2017-11-12 10:40 GMT
పాకిస్థాన్ ఆక్ర‌మిత కాశ్మీర్‌... మ‌న‌మంతా పీఓకేగా పిలుస్తున్న ఈ ప్రాంతంపై ఇప్పుడు మాట‌లు మంట‌లు రేపుతున్నాయి. అస‌లు కాశ్మీర్‌లో నిత్యం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు పీఓకేనేన‌న్న విష‌యం ఏ ఒక్క‌రు కూడా కాద‌న‌లేని స‌త్య‌మే. అయితే పాకిస్థాన్ ఆక్ర‌మించుకున్న ఈ ప్రాంతం ఎవ‌రిద‌న్న విష‌యంపై ఇటు భార‌త్‌తో పాటు అటు పాకిస్థాన్ కూడా త‌మ త‌మ వాద‌న‌ల‌ను అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనే ప్ర‌స్తావిస్తూనే ఉన్నాయి. పీఓకే త‌న భూభాగంలోని ప్రాంత‌మేన‌ని పాకిస్థాన్ వాదిస్తుండ‌గా, అందులో వాస్త‌వ‌మేమీ లేద‌ని, పీఓకే ముమ్మాటికీ త‌న భూభాగంలోని ప్రాంత‌మేన‌ని, పాకిస్థానే ఆ ప్రాంతాన్ని దురాక్ర‌మించింద‌ని భార‌త్ వాదిస్తోంది. అస‌లు త‌న భూభాగంపైకి విరుచుకుప‌డుతున్న ఉగ్ర‌వాదుల‌కు పీఓకేను పాక్ ఓ లాంచ్ ప్యాడ్‌లాగా మార్చేసింద‌ని కూడా భార‌త్ వాదిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎవ‌రి వాద‌న నిజ‌మ‌న్న విష‌యంపై అంత‌ర్జాతీయ స‌మాజం కూడా ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌మైన మాట చెప్ప‌లేద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో ఈ వివాదంపై జ‌మ్మూ కాశ్మీర్‌ కు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లా నిన్న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. పీఓకే పాక్ అంత‌ర్భాగ‌మేన‌ని ఫ‌రూక్ చాలా విస్ప‌ష్టంగానే త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు. ఫ‌రూక్ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర లేచింద‌నే చెప్పాలి. ఫ‌రూక్ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టిదాకా ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌లెవ్వ‌రూ స్పందించ‌క‌పోయినా... బాలీవుడ్ వెట‌ర‌న్ యాక్ట‌ర్ రిషీ క‌పూర్ మాత్రం ఏ ఒక్క‌రి ప్ర‌మేయం లేకుండానే ఈ వివాదంలో వేలు పెట్టేశారు. ఫ‌రూక్ అబ్దుల్లా వ్యాఖ్య‌ల‌తో తాను కూడా ఏకీభ‌విస్తున్నాన‌ని పేర్కొన్న రిషీ క‌పూర్‌... పీఓకే ముమ్మాటికీ పాక్ లో అంత‌ర్భాగ‌మేన‌ని తేల్చి చెప్పాడు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైన రిషీ క‌పూర్ త‌న మ‌న‌సులోని మాట‌ను సూటిగానే చెప్పేశాడు.

అయినా స‌ద‌రు ట్వీట్‌ లో రిషీ క‌పూర్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఆక్రమిత కశ్మీర్‌ ను పాకిస్తాన్‌ కు దఖలు పరిస్తేనే.. కశ్మీర్‌ సమస్యకు శాంతియుత - శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్న‌ట్లుగా కూడా రిషి కపూర్ ఆ ట్వీట్‌ లో పేర్కొన్నాడు. అస‌లు వాస్త‌వ విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లుగా చెప్పిన ఫ‌రూక్‌ ను రిషీ క‌పూర్ ఆకాశానికెత్తేశారు. ఫ‌రూక్‌ కు థ్యాంక్స్ చెబుతూనే.. తాను చనిపోయేముందు ఒక్కసారి అయినా పాకిస్తాన్‌ ను చూడాలి.. మా పూర్వీకులు మూలాలను స్పృశించాలని ఉందంటూ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ పై రిషి కపూర్‌ ట్విటర్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు, కొందరైతే తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తే.. మరికొందరు మాత్రం ఇటువంటి ట్వీట్లు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి నిన్న ఫ‌రూక్ చేసిన వ్యాఖ్య‌లతో దీనిపై వివాదం రేగ‌గా.... తాజాగా రిషీ క‌పూర్ త‌న ట్వీట్‌ తో ఆ వివాదానికి మ‌రింత‌గా ఆజ్యం పోసిన‌ట్టైంది.
Tags:    

Similar News