కేటీఆర్ ను ట్వీట్ తో ఇరుకున పెట్టిన న‌గ‌ర యువ‌తి

Update: 2019-05-19 05:38 GMT
ఎవ‌రైనా కావొచ్చు.. ఎంత‌టి వారినైనా తాము అడ‌గాల‌నుకున్న విష‌యాన్ని నేరుగా అడిగే అవ‌కాశాన్ని సోష‌ల్ మీడియా క‌ల్పిస్తోంది. తాజాగా ఈ మాధ్య‌మంతో హైద‌రాబాద్‌కు చెందిన యువ‌తి ఒక‌రు ప్ర‌శ్నించిన ప్ర‌శ్న టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో స‌హా అధికార యంత్రాంగాన్ని ఇరుకున ప‌డేలా చేసింది.

ఇంత‌కీ జ‌రిగిదేమంటే.. న‌గ‌రానికి చెందిన రిషిత‌రెడ్డి అనే యువ‌తి కేటీఆర్ కు ఒక ట్వీట్ చేశారు. అక్ర‌మ నిర్మాణాల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేదు?  మీరంతా అవినీతిప‌రులా?  లేదా.. రాజ‌కీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా?  మీ వ‌ల్ల తెలంగాణ  ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోందంటూ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీంతో.. స్పందించిన కేటీఆర్.. ఆ ట్వీట్ ను జీహెచ్ ఎంసీ ఆన్ విభాగానికి.. జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్.. ఇత‌ర కీల‌క అధికారుల‌కు ట్యాగ్ చేశారు.

యువ‌తి ట్వీట్ కు స్పందించిన‌కేటీఆర్‌.. యువ‌తి ట్వీట్ లోని విష‌యంపై వీలైనంత త్వ‌ర‌గా ప‌రిశీలించాల‌ని కోర‌గా.. దానికి వెంట‌నే జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్ స్పందించారు. విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. మ‌రో అధికారి నిబంధ‌న‌ల ప్ర‌కారం నోటీసులు ఇచ్చామ‌ని బ‌దులిచ్చారు.

ఇక్క‌డితో విష‌యం పూర్తి కాలేదు. రిషిత రెడ్డి చేసిన ట్వీట్ కు ప‌లువురు నెటిజ‌న్లు.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల్ని.. అక్ర‌మ క‌ట్టడాల వివ‌రాల్ని ట్వీట్ల రూపంలో చెప్ప‌టం షురూ చేశారు. భారీ ఎత్తున క‌డుతున్న అక్ర‌మ నిర్మాణాల వివ‌రాల్ని వారు బ‌య‌ట‌పెట్ట‌టం విశేషం. మొత్తానికి న‌గ‌ర యువ‌తి ఒక‌రు పెట్టిన ట్వీట్ అక్ర‌మ నిర్మాణాల‌పై కొత్త క‌ద‌లిక‌కు కార‌ణ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News